హత్య కేసులో నిందితుడి అరెస్టు
పుత్తూరు : పట్టణ పరిధిలో ఈనెల 9వ తేదీన చినరాజుకుప్పం గ్రామంలో జరిగిన బి.మణికంఠ(29) హత్య కేసులో నిందితుడైన బి.వెంకటేశులును అరెస్టు చేసినట్లు సీఐ సురేంద్రనాయుడు తెలిపారు. మంగళవారం సీఐ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా.. చినరాజుకుప్పం గ్రామానికి చెందిన బి.సుబ్బరాయులు, చెంచమ్మ కుమారుడు మణికంఠ ఈనెల 9వ తేదీన తన చిన్నాన్న వెంకటేశులు ఇంట్లో హత్యకు గురయ్యాడు. మృతుడు మణికంఠకు స్వయాన చిన్నాన్న అయిన బి.వెంకటేశులుతో కలసి తరచూ మద్యం తాగడం, గొడవ పడడం సాధారణ విషయంగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు భావించేవారు. పుట్టుకతో వికలాంగుడైన వెంకటేశులును మణికంఠ తరచూ హేళనగా మాట్లాడేవాడని, తరచూ కొడుతూ నిన్ను చంపేస్తే నీ ఆస్తి మొత్తం తనకు వస్తుందని చెప్పేవాడు. ఈ నేపథ్యంలో ఈనెల 9వ తేదీన వెంకటేశులు ఇంట్లో మద్యం తాగుతూ ఇద్దరి మద్య గొడవ ప్రారంభమైంది. ఈక్రమంలో మణికంఠ.. వెంకటేశులును కొడుతూ తిట్టడం ప్రారంభించాడు. మణికంఠ మద్యం మత్తులో జోగుతున్న సమయంలో అతడి నుంచి తనకు ముప్పు పొంచి ఉందని భావించిన వెంకటేశులు తన వద్దనున్న రోకలిబండతో మనికంఠ తలపై బలంగా కొట్టడం జరిగింది. మనికంఠ మృతి చెందినట్లు భావించిన తర్వాత ఇంటి బయటకు వచ్చిన వెంకటేశులు ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లావణ్య అనే గ్రామస్తురాలు రక్తపు మడుగులో పడి ఉన్న మనికంఠను చూసి కేకలు పెడుతూ అందరికీ చెప్పింది. దీంతో అక్కడి నుంచి వెంకటేశులు పరారయ్యాడు. మృతుడు తల్లి చెంచమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుత్తూరు డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసిన సీఐ సురేంద్రనాయుడు మంగళవారం నిందితుడు వెంకటేశులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment