లక్ష్యం దిశగా అడుగులు
● జిల్లాలో చురుగ్గా పన్నుల వసూళ్ల ప్రక్రియ ● లక్ష్యం రూ.24.30 కోట్లు.. వసూలు రూ.20.96 కోట్లు ● ఇప్పటికే 86 శాతం పూర్తి ● రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం ● గడువు నాటికి వందశాతం పూర్తికి కృషి
చిత్తూరు కార్పొరేషన్ : పంచాయతీల అభివృద్ధికి.. కార్మికులకు నెలనెలా జీతాలకు పన్నుల వసూళ్లే కీలకం. సకాలంలో పన్ను వసూలు చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మార్చి నెలాఖరులోగా పన్ను వసూలు చేయాలి. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా, మండల స్థాయి అధికారులు తరచూ ఆదేశాలు జారీ చేస్తుంటారు. వీటిని పక్కాగా అమలు చేయడానికి జిల్లా పంచాయతీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గడువు సమయంలో తొందర పడకుండా ముందుస్తుగా దశల వారీగా ఒత్తిడి తెచ్చారు. దీంతో నిర్దేశించిన లక్ష్యంలో గురువారం నాటికే 86 శాతానికి చేరుకున్నారు. మరో పది రోజుల్లో అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని పనిచేస్తున్నారు. పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో ప్రస్తుతం చిత్తూరు జిల్లా రెండో స్థానంలో ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
జిల్లాలో నవంబర్ నుంచే..
ఏటా పన్నుల వసూళ్లు చేయాలని అధికారులు చెప్పడం క్షేత్రస్థాయి సిబ్బంది సరే అనడం.. తీరా మార్చినెల అయ్యాక ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం సర్వసాధారణంగా మారింది. కానీ వీటిపై ఈసారి అధికారులు రూట్ మార్చారు. చివరి రోజుల్లో పరుగెత్తే బదులు ముందు నుంచి నడుస్తామని పక్కా ప్లాన్ చేసుకున్నారు. నవంబర్ నుంచే రోజూ పన్నుల వసూళ్లు, ఇతర విషయాల మీద సమావేశాలు సిబ్బందితో నిర్వహించారు. వారిని వీటిపై సిద్ధం చేస్తూ పలు సూచనలు చేశారు. స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్‌లో అసెస్‌మెంట్ వివరాలను సిద్ధం చేసుకున్నారు. పంచాయతీ వారీగా ఎంత రావాలి? ఎంత వస్తుంది ?ఎక్కడ ఆలస్యమవుతుంది? అనే విషయాల పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు గురించి స్థానికులకు తెలియజేస్తూ పన్నులు చెల్లించాలని గ్రామస్తులకు చెబుతూ వసూళ్లు ప్రారంభించారు. జనవరి నుంచి వీటిని వేగవంతం చేస్తూ వచ్చారు. దీంతో మార్చి 20 నాటికి 86 శాతం నిర్దేశించిన లక్ష్యానికి చేరుకున్నారు. మార్చి 25 నాటికి 90 శాతం నెలాఖారుకు 95 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. పంచాయతీ ఉద్యోగులు, మండల అధికారులు, డివిజనల్ అధికారులు సమష్టిగా వీటిపై ఫోకస్ పెట్టారు. ప్రతి పంచాయతీలో సెక్రటరీలు, బిల్ కలెక్టర్లు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది అందరికీ పలు ఆదేశాలు అధికారులు ఇచ్చారు. పన్నుల వసూళ్లను బట్టి పనితీరున అర్థం చేసుకోవచ్చు. అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల నేతృత్వంలో బిల్ కలెక్టర్లతో పాటు సచివాలయ ఉద్యోగులు ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుస్తోంది. ఎంపీడీఓల ప్రత్యేక పర్యవేక్షణ వీటికి తోడు అయింది.
ప్రత్యేక చర్యలు
పంచాయతీల అభివృద్ధికి ప న్ను బకాయిలు విఘాతం కా కూడదు. ప్రతి ఒక్కరూ మార్చి 31 లోపు పాత బకాయిలు, ప్రస్తుత పన్నులు అందరూ చెల్లించాలి. నవంబరు నుంచి వసూళ్ల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అప్పటి నుంచి వసూళ్లను ప్రారంభించి జనవరి నుంచి వేగం పెంచాం. వందశాతం వసూళ్లే లక్ష్యంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరూ ఇలాగే పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి.
–సుధాకర్‌రావు, డీపీఓ, చిత్తూరు జిల్లా
86 శాతం వసూళ్లు
జిల్లా పరిధిలో 697 పంచాయతీలు ఉండగా లక్ష్యంలో 86 శాతం వసూళ్లు రాబట్టారు. చిత్తూ రు, నగరి, పలమనేరు, కుప్పం రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి. పాత బకాయిలు రూ.4.75 కోట్లు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను, పన్నేతరాలు కలిపి రూ.19.55 కోట్లు వసూలు కావాల్సి ఉంది. పాత బకాయిలతో కలిపి ఇప్పటికి రూ.24.30 కోట్లలో రూ.20.96 కోట్లు వసూలు అయింది. ఈనెలాఖరులోగా మిగిలిన రూ.3.34. కోట్ల వసూలు అవ్వాల్సి ఉంది. నగరి డివిజన్‌లో రూ.1.42 కోట్లు, కుప్పంలో రూ.1.42 కోట్లు, చిత్తూరు డివిజన్‌లో రూ.9.79 కోట్లు, పలమనేరు రూ.7.43 కోట్లు వసూళ్లు వచ్చింది. అంటే చిత్తూరు మొదటి స్థానంలో, పలమనేరు, నగరి, కుప్పం తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్ర అధికారులు ఫిబ్రవరిలోపు 50 శాతం, మార్చి రెండో వారానికి 75 శాతం, చివరికి 100 శాతం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
డివిజన్ పంచాయతీలు పన్నుల లక్ష్యం వసూళ్లు
(రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
చిత్తూరు 296 11.77 9.99 నగరి 102 1.79 1.72 పలమనేరు 206 8.99 7.73 కుప్పం 93 1.74 1.52 మొత్తం 697 24.30 20.96
లక్ష్యం దిశగా అడుగులు
Comments
Please login to add a commentAdd a comment