అనుమానితుడిని విద్యుత్ స్తంభానికి బంధిస్తున్న గ్రామస్తులు
సాక్షి, బరంపురం(భువనేశ్వర్): నగర శివారులోని తీరప్రాంతం సూన్పూర్ గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి, ఆపై గొంతుకోసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహానికి గురై.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు అనుమాతులను విద్యుత్ స్తంభానికి బంధించి, దేహశుద్ధి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న గొళంత్ర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వారిని గ్రామంలోకి రానివ్వకుండా గ్రామస్తులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉధ్రిక్తత చోటు చేసుకుంది. బాధిత గ్రామస్తులు, ఐఐసి అధికారి బాబులినాయక్ తెలిపిన వివరాల ప్రకారం... గొళంత్ర పోలీసు స్టేషన్ పరిధిలోని మత్స్యకార గ్రామం సూన్పూర్లో ఏడేళ్ల బాలికను ఇంట్లో ఎవరూలేసి సమయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గ్రామ శివారులోని పాడుబడిన ఇంట్లోకి లాక్కెళ్లారు. అక్కడ చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై గొంతు కోసి హత్యకి ప్రత్నించారు. విషయం తెలుసుకున్న సూన్పూరు గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని గుర్తించి, అంబులైన్స్లో ఎంకేసీజీ మెడికల్కి తరలించారు
పోలీస్ స్టేషన్కు తరలింపు..
మరోవైపు ఘటనకు కారణమై ఉంటారన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పట్టుకున్న గ్రామస్తులు.. తీవ్ర ఆగ్రహంతో మూకుమ్మడిగా దాడి చేసి, చితక బాదారు. అనంతరం విద్యుత్ స్తంభానికి కట్టి, బంధించారు. సమాచారం అందకున్న గొళంత్రా పోలీసులు సూన్పూర్ గ్రామానికి చేరుకోగా.. స్థానికులు వారిని గ్రామ పొలిమేరల్లోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసు అధికారులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సూన్పూర్లో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఎట్టకేలకు గ్రామస్తులకు నచ్చజెప్పి, గాయాలతో ఉన్న అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. నిందితులను పోలీసు స్టేషన్కు తరలించి, దర్యాప్తు చేస్తున్నామని ఐఐసీ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment