సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి, అక్కతో కలిసి సంతోషంగా బయటకు వెళ్లిన బాలుడికి అదే రోజు చివరి రోజయ్యింది. అప్పటి వరకు ఉత్సాహంగా ఆడుకున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయడంతో మృతిచెందాడు. ఈ దారుణ ఘటన అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది.
నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలానికి చెందిన గంగాధర్.. ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఓ కారు సర్వీస్ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, భార్య, పిల్లలతో కలిసి అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఆరేళ్ల కుమార్తే, నాలుగేళ్ల కమారుడు ప్రదీప్‌లను తను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్ వద్దకు తీసుకెళ్లాడు. మార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి, కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు.
అనంతరం పనిలో నిమగ్నమయ్యాడు. కాసేపు అక్కడ ఆడుకున్న కుమారుడు ప్రదీప్.. తర్వాత అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. కుక్కలను చూసి భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయినా అవి చిన్నారిని వదలకుండా తీవ్రంగా దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
తమ్ముడి అరుపులు విన్న అక్క వెంటనే తండ్రి వద్దకు పెరుగెత్తి సమాచారమిచ్చింది. విషయం తెలుసుకున్న గంగాధర్ హుటాహుటిన వచ్చి కుక్కలను వెళ్లగొట్టి.. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు కుక్కులు దాడి చేసిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డవ్వగా.. అవి చూస్తుంటే ఓళ్లు జలదరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment