సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కుక్కల బెడదపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు మంత్రి సంతాపం తెలిపారు. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి చాలా బాధాకరమని అన్నారు. సిటీలో కుక్కల నియంత్రణకై చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యతు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రతి మున్సిపాల్టీల్లోనూ వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
కాగా వీధి కుక్కలు దాడి చేయడంతో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం నాడు తండ్రి పనిచేస్తున్న కారు సర్వీస్ సెంబర్ వద్దకు వెళ్లిన చిన్నారిని వీధి కుక్కలు వెంటాడాయి. కుక్కలను చూసి భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయినా అవి చిన్నారిని వదలకుండా తీవ్రంగా దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న తండ్రి హుటాహుటిన వచ్చి కుక్కలను వెళ్లగొట్టి.. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు కుక్కులు దాడి చేసిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డవ్వగా.. అవి చూస్తుంటే ఓళ్లు జలదరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment