
సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కాంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న దేవికారాణికి ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆమెతో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మసీస్ట్ వసంత, మరో ఇద్దరు ఫార్మా ఉద్యోగులకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఐటీతోపాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అవతవకల ద్వారా వచ్చిన సొమ్ముతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మ తదితరులు భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన విషయాన్ని ఏసీబీ తన దర్యాప్తులో వెల్లడించింది. దేవికారాణిపై దాడుల సమయంలో ఇందుకు సంబంధించిన పలు రసీదులు దర్యాప్తు అధికారులకు లభించడంతో ఈ విషయం వెలుగుచూసింది.
Comments
Please login to add a commentAdd a comment