ప్లాన్ విఫలం: అరుణాకుమారి (ఫైల్)- మోసగాళ్లతో ముప్పుతిప్పలు... దర్శన్
మైసూరు(కర్ణాటక): సినిమాల్లో వీరోచిత సాహసాలతో విలన్లను మట్టికరిపించే ప్రముఖ నటుడు దర్శన్ నిజ జీవితంలో మోసగాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వారు సాదాసీదా చీటర్లు కాదు ఏకంగా రూ.25 కోట్లకు ఎసరు పెట్టారు. ఆదివారం బయటపడిన ఈ బాగోతంపై సోమవారం దర్శన్ ఘాటుగా స్పందించారు. నా ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రూ. 25 కోట్లను పొందాలని చూసి, నాపై కుట్ర చేసినవారు ఎంతటి సన్నిహితులైనా వదిలిపెట్టేది లేదు. చట్టపరంగా పోరాడుతా అని ప్రకటించారు.
తెరపై ఆ మహిళ..
మైసూరులో మీడియా సమావేశంలో దర్శన్ మాట్లాడారు. వివరాలు.... జూన్ 6వ తేదిన నా మిత్రుడు, కన్నడ సినిమా నిర్మాత ఉమాపతి నాకు ఫోన్ చేసి రూ.25 కోట్ల బ్యాంకు రుణానికి మీరు ష్యూరిటీ సంతకం చేశారా? అని అడిగారు. నేను అయోమయానికి గురయ్యాను. ఏం జరిగిందని ఉమాపతిని అడగ్గా ఏమీ చెప్పలేదు. జూన్ 16వ తేదీన అరుణాకుమారి అనే మహిళను నిర్మాత ఉమాపతి నా ఇంటికి తీసుకొచ్చారు. ఆమె నా స్నేహితుల పేర్లను చెబుతూ కొన్ని దాఖలాలు చూపించారు. అందులో నా ఆధార్ నంబర్ తప్ప ఇంకేమీ లేదు. నేను పుట్టిన ప్రాంతం, జిల్లా పేరును ఆమె చెప్పగా అనుమానం పెరిగింది.
నేను ఆమె ముందే నాగు, హర్ష అనే నా మిత్రులకు కాల్ చేసి లోన్‌కు దరఖాస్తు పెట్టారా అని అడిగా, లేదు అని చెప్పారు. మరోసారి అరుణతో నందీష్, మదుకేష్ అనే ఇద్దరు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు. లోన్ ఇవ్వడానికి ముందు మీ తోటను చూడాలని అడగ్గా, సరే అన్నాను. నా తరఫున లోన్ కోసం హర్ష రికార్డులు ఇచ్చారని అరుణ చెప్పారు. చివరకు నా స్నేహితులందరినీ ఆరా తీయగా ఎవరూ రుణం కోసం దరఖాస్తు చేయలేదని తెలిపారు. అరుణపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశా... అని ది బాస్ వివరించారు. సూత్రధారులు, పాత్రధారుల గురించి పోలీసుల విచారణలో బయటికి వస్తుందని దర్శన్ అన్నారు.
డీసీపీతో భేటీ..
నకిలీ పత్రాలను తయారుచేసిన వంచకులు వాటిని దర్శన్ స్నేహితులకు చూపి మాట వినకపోతే దుష్ప్రచారం చేస్తామని బెదిరించినట్లు తెలిసింది. దర్శన్, ఉమాపతి తదితరులు మైసూరు డీసీపీ ప్రదీప్ గుంటిని కలిసి ఫిర్యాదు చేశారు. మైసూరు హెబ్బాల పోలీసులు అరుణాకుమారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment