కరప(తూర్పుగోదావరి): నడకుదురు శివారున యానాం బైపాస్ రోడ్డులో హత్యకు గురైన గుర్తు తెలియని యువకుడి వివరాలు వెల్లడైనట్టు తెలిసింది. నడకుదురు – కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామాల మధ్య తుమ్మ చెట్ల గుంపులో గుర్తు తెలియని దుండగులు ఇటీవల ఓ వ్యక్తిని పెట్రోలు పోసి, తగులబెట్టిన విషయం పాఠకులకు విదితమే. సంఘటన స్థలాన్ని, పరిసరాలను పోలీసులు మూడు రోజులుగా జల్లెడ పట్టినా కొంచెం కూడా క్లూ దొరకలేదు. దీంతో ఈ హత్య కేసు పోలీసులకు సవాలుగా నిలిచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హతుడిని రామచంద్రపురం మండలం వెల్ల గ్రామానికి చెందిన పేపకాయల సతీష్‌కుమార్(35)గా గుర్తించారని తెలిసింది. ‘గుర్తు తెలియని యువకుని హత్య’ శీర్షికన ఈ నెల 17న వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను చూసిన హతుని భార్య, పిల్లలతో కలసి ఘటనా స్థలాన్ని, హతుని మృతదేహాన్ని పరిశీలించింది.
హతుని మొలకు ఉన్న తాళం చెవి ఆధారంగా అతడు సతీష్‌కుమార్ అని గుర్తించింది. అతడు కాకినాడ వెళ్లి వస్తానని ఈ నెల 15న ఇంటి వద్ద చెప్పి, వెల్ల నుంచి సైకిల్‌పై బయలుదేరాడు. అదే గ్రామంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద సైకిల్ ఉంచి వెళ్లాడు. అప్పటి నుంచీ తిరిగి రాలేదు. హతుని వద్ద లభ్యమైన తాళం చెవితో అతడి సైకిల్ తాళం తెరచుకుంది. హతుడి చేతిపై పాత గాయాలు, దుస్తుల ఆధారంగా కూడా అతడు సతీష్‌కుమారేనని గుర్తించారు.
అతడు కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతుండడంతో భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. అతడికి వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని అంటున్నారు. గతంలో అతడు ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడని చెబుతున్నారు. సతీష్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఎవరైనా హత్య చేశారా అనేది తెలియలేదు. అయితే ఈ విషయాలను పోలీసులు ధ్రువీకరించలేదు. ఇంతవరకూ హతుని, హంతకుల వివరాలు తెలియలేదని కరప ఎస్సై డి.రామారావు చెప్పారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని, త్వరలోనే అన్ని వివరాలూ వెల్లడిస్తామని అన్నారు.
చదవండి:
చిన్నారుల హత్య కేసులో విస్తుపోయే నిజాలు..
దారుణం: బాత్‌రూమ్ గుంతలో మొండెం, కాళ్లు..
Comments
Please login to add a commentAdd a comment