సాయం చేస్తా... సరదా తీర్చండి! | Allegations against Bellampally MLA Durgam Chinnayya | Sakshi
Sakshi News home page

సాయం చేస్తా... సరదా తీర్చండి!

Published Tue, Mar 28 2023 1:45 AM | Last Updated on Tue, Mar 28 2023 10:39 AM

Allegations against Bellampally MLA Durgam Chinnayya - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు డెయిరీ విస్తరణకు సాయం చేస్తానంటూ యాజమాన్యాన్ని వేధించారని, ఉద్యోగి అయిన ఓ అమ్మాయిని పంపాలంటూ ఇబ్బందిపెట్టారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఆయన బంధువుకు కొంత వాటా ఇచ్చామని.. ఆయన కోరినట్టు కాకున్నా బ్రోకర్‌ ద్వారా వేరే యువతిని పంపామని డెయిరీ భాగస్వామి పేరిట ఓ ఆడియో విడుదలైంది. డబ్బులతో పాటు అన్ని రకాలుగా తమను వాడుకుని కూడా.. తమపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయటపెడుతున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కొన్ని వాట్సాప్‌ స్క్రీన్‌ షాట్లను కూడా విడుదల చేశారు. 

అసైన్డ్‌ భూమి.. ఐదు శాతం వాటా! 
ఆర్జిన్‌ డెయిరీ సంస్థ మంచిర్యాల జిల్లాలో తమ బ్రాంచ్‌ ఏర్పాటు కోసం కొంతకాలం నుంచి ప్రయత్నిస్తోంది. అది తెలిసిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోనే ఆ డెయిరీ ఏర్పాటు చేయాలని, అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ కంపెనీ కోసం జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండెకరాల అసైన్డ్‌ భూమిని అప్పగించారు. అది లావణి పట్టా భూమి అయినా విక్రయించినట్టుగా పేర్కొని బేరం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ స్థలంలో డెయిరీ ప్లాంటు, పాల నిల్వ కోసం శీతల గిడ్డంగి, ప్యాకింగ్‌ కేంద్రం నిర్మించాలని ప్రణాళిక వేశారు.

నిర్మాణం మొదలయ్యే ముందే ఆ ప్రజాప్రతినిధి తన సమీప బంధువు పేరుతో ఐదు శాతం వాటా సైతం తీసుకున్నారని.. తర్వాత డబ్బులు, ఇతర ‘సాయం’ కూడా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే డబ్బుల విషయంలో గొడవ తలెత్తినట్టు తెలిసింది. గత జనవరిలో ఏకకాలంలో పదిచోట్ల ఈ డెయిరీ నిర్వాహకులపై మోసం కేసులు నమోదయ్యాయి. పోలీసులు పలుమార్లు కంపెనీ ప్రతినిధులను పిలిపించి విచారించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కంపెనీలో భాగస్వామి అయిన షెజల్‌ అనే యువతి పేరిట ఆడియో, వీడియో, పలు వాట్సాప్‌ స్క్రీన్‌షాట్లు విడుదల అయ్యాయి. 

‘ట్యాబ్లెట్లు’ అంటూ అమ్మాయి కోసం చాటింగ్‌! 
డెయిరీ పనుల నిమిత్తం పలుమార్లు హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలిశామని, ఆయన కోరిన పనులు చేసిపెట్టామని సంస్థలో భాగస్వామి అయిన యువతి ఆడియోలో ఆరోపించారు. ‘‘ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లినప్పుడు నా వెంట సంస్థలో పనిచేసే ఓ అమ్మాయి వచ్చేది. ఆమెపై ఎమ్మెల్యే కన్నేశాడు. ఓ రోజు ఫోన్‌ చేసి.. ఆ అమ్మాయిని రాత్రికి తన వద్దకు పంపించాలన్నారు. ఆమె అలాంటిది కాదని చెప్పినా వినలేదు. అమ్మాయిని పంపకుంటే ఏం చేయాలో అది చేస్తానని బెదిరించాడు.

చివరికి ఎవరి ద్వారానో ఓ బ్రోకర్‌ను సంప్రదించి ఎమ్మెల్యే వద్దకు వేరే ఓ యువతిని పంపాల్సి వచ్చింది. నేరుగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కే ఆ యువతిని పిలిపించుకున్నారు. తర్వాత దళిత బంధు పథకం కోసం మాట్లాడుదామని మమ్మల్ని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు, మంచిర్యాలకు పిలిపించుకున్నాడు. అన్నింటిలో ఇన్‌వాల్వ్‌ చేయవద్దని, చెప్పినవన్నీ చేయలేమని మేం అనడంతో.. మాపై తప్పులు కేసులు పెట్టించారు.

మేం తప్పు చేయలేదని చెప్పినా పోలీసులు పీఎస్‌కు తీసుకెళ్లి ఇబ్బందిపెట్టారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంలో మాకు అండగా నిలవాలి..’’ అని పేర్కొన్నారు. తర్వాత షెజల్‌ పేరిట మరో వీడియో విడుదలైంది. ‘‘ఎమ్మెల్యే మనుషులు మాకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే నుంచి మాకు ప్రాణహాని ఉంది. మాకు ఏం జరిగినా పూర్తి బాధ్యత ఎమ్మెల్యే, పోలీసులదే..’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. 

– ఇక యువతిని పంపే అంశంలో ఎమ్మెల్యే, డెయిరీ నిర్వాహకుడి మధ్య జరిగినవిగా చెప్తున్న వాట్సాప్‌ చాటింగ్‌లలో.. ‘ట్యాబ్లెట్లు కావాలి. రిలాక్సేషన్‌ పొందాలి. ఆ అమ్మాయి వస్తుందా?’ అంటూ సాగిన సంభాషణలు, హైదరాబాద్‌లో చేసిన ‘ఎంజాయ్‌’పైనా మెస్సేజ్‌లు ఉండటం గమనార్హం. 

దళితబంధులో కోట్లు కొట్టేసేలా? 
దళితబంధులో 200 పాడి యూనిట్లు ఇప్పిస్తే రూ.2 కోట్లు ఇస్తామని మంచిర్యాల జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తన నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఆఫర్‌ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరో నియోజకవర్గంలోని ఓ యువ నాయకుడితో కూడా యూనిట్లు ఇప్పించేలా చర్చలు జరిగినట్టు తెలిసింది.

మరో ప్రజాప్రతినిధి గేదెలకు బదులు ట్రాక్టర్లు ఇవ్వాలని కోరగా.. ఆ మేరకు సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం నుంచి రెండో విడత యూనిట్లు మంజూరు కాక ప్రణాళిక ముందుకు కదల్లేదని తెలిసింది. సదరు మార్కెట్‌ చైర్మన్‌ మాత్రం డబ్బులు తీసుకుని గేదెలు ఇవ్వలేదని, ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్‌కావడంతో వివాదం మరింత ముదిరిందని సమాచారం.

ఈ వ్యవహారంలోనే డెయిరీ వారిని కూడా ఇన్వాల్వ్‌ చేసేందుకు ప్రజాప్రతినిధి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌తోపాటు వరంగల్‌ ప్రాంతంలో ఈ డెయిరీ నిర్వాహకులపై పలు కేసులు ఉన్నాయని.. రైతులకు పశువుల బీమా కింద ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయిన వివాదాలు, ఇతర కేసులు నమోదయ్యాయని సమాచారం. 

వ్యవహారంపై సీఎంవో నజర్‌? 
మంచిర్యాల జిల్లాలో ప్రలోభాల వ్యవహారంపై ఈ నెల 26న ‘సాక్షి’లో ‘పాల కోసం ప్రలోభాలు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర, జిల్లా స్థాయి నిఘా వర్గాలు పలు వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఇందులో అధికార పార్టీ నేతలపై తీవ్ర స్థాయి ఆరోపణలు రావడంతో సీఎం ఆఫీసు కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. 
 
నాపై దుష్పప్రచారం చేస్తున్నారు 
నాపై కావాలనే ప్రైవేటు డైయిరీ నిర్వాహకులు దుష్పప్రచారం చేస్తున్నారు. ఇక్కడ జరిగిన మోసాలపై కేసులు నమోదు చేస్తే.. కోర్టు హాజరు నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారు. నిర్వాహకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. డెయిరీ సంస్థ రైతులను మోసం చేసింది. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో సహా బయటపెడతాను. 
– దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement