తల వెంట్రుకలు నోట్లో కరుచుకొని ఈడ్చుకెళ్లిన వీధికుక్కలు
బాలుడికి తీవ్రగాయాలు... రక్తస్రావం..గాంధీ ఆస్పత్రిలో మృతి
ఇంకెన్ని ప్రాణాలు పోతే అధికారులు పట్టించుకుంటారని స్థానికుల ఆగ్రహం
జవహర్‌నగర్/గాందీఆస్పత్రి: మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఆరు బయట ఆడుకుంటున్నాడు...అదే సమయంలో వీధి కుక్కలు గుంపుగా అక్కడకు వచ్చాయి. ఒక్కసారిగా ఆ బాలుడిపై దాడి చేశాయి. తలభాగాన్ని నోట్లో కరుచుకొని కొంత దూరం ఈడ్చుకెళ్లాయి. అలా ఈడ్చుకుంటూ వెళుతున్న క్రమంలో ఆ బాలుడి తలవెంట్రుకలు, తలలోని కొంత భాగం ఆ పరిసరాల్లో ఊడి పడింది. గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన మల్కాజిగిరి–మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన భరత్–లక్ష్మి దంపతులకు ఏడాదిన్నర కుమారుడు విహాన్ ఉన్నాడు. లక్ష్మి సోదరుడు వెంకట్ జవహర్‌నగర్‌లోని ఆదర్శనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆయన ఇంటికి లక్ష్మి దంపతులు కుమారుడితో కలిసి చుట్టపుచూపుగా కొద్దిరోజుల క్రితం వచ్చారు. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో విహాన్ ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. గుంపులుగా వచ్చిన వీధి కుక్కలు ఒక్కసారిగా విహాన్‌పై దాడి చేశాయి. కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లి పడేశాయి.
ఈ ఘటన జరిగిన సమయంలో అదే కాలనీలో ఉన్న ఓ వ్యక్తి ఆ కుక్కల గుంపు దగ్గరకు వెళ్లి చూడగా, బాలుడు తీవ్ర రక్తస్రావంతో కిందపడి ఉన్నాడు. ఒళ్లంతా రక్కడంతో కుక్కకాటు గుర్తులు ఉన్నాయి. ఆ పరిసరాల్లోనే విహాన్ తల వెంట్రుకలు, మెదడులోని కొంత భాగం కూడా మరో చోట పడింది. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడిని గాంధీ ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు. శరీరమంతా కుక్కకాట్లతో నిండిపోయి ఉండటంతో పరిస్థితి విషమించింది.
అనస్థీషియా, పిడియాట్రిక్ తదితర విభాగాలకు చెందిన వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. రాత్రి 9:30 గంటలకు విహాన్ మృతి చెందాడు. తీవ్రమైన రక్తస్రావం కావడంతో కాపాడలేకపోయామని గాంధీ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. జవహర్‌నగర్ పరిధిలో వీధికుక్కల బెడద ఎక్కువగానే ఉందని స్థానికులు వాపోయారు. ఇంకెన్ని ప్రాణాలు పోతే.. అధికారులు ఈ సమస్యను పట్టించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment