గన్నవరంలో ఓ వ్యక్తికి ‘మీరు కరెంట్ బిల్లు చెల్లించలేదు. విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. వెంటనే విద్యుత్ అధికారిని సంప్రదించండి’ అంటూ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఓ సెల్ ఫోన్ నంబర్ ఉంది. ఆ మెసేజ్ చూసి కంగుతిన్న ఆ వ్యక్తి.. వెంటనే అందులో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశాడు. అంతే, అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి.
సాక్షి, అమరావతి: ‘క్రైమ్ అంతం కాదు.. దాని స్వరూపం మార్చుకుంటుందంతే’.. అంటూ ఒక సినిమాలో చెప్పిన వ్యాఖ్యలను అక్షరాలా నిజం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఒకప్పుడు క్రెడిట్ కార్డు బకాయి చెల్లించలేదని, ఏటీఎం కార్డు గడువు తేదీ ముగిసిందని ఫోన్ చేసి ఓటీపీలు అడిగేవారు. చెప్పగానే బ్యాంకులో డబ్బులు లాగేసేవారు. లాటరీ టికెట్ తగిలిందని, భారీ ఆఫర్లు అంటూ ఫోన్‌కు లింక్‌లు పంపేవారు. వాటిని తెరిస్తే అంతే సంగతులు. ఇప్పుడు ఓటీపీలు, లింకులు, బ్యాంకు వివరాలు కోరడం వంటి వాటిపై ప్రజల్లో అవగాహన పెరగడంతో నేరగాళ్లు కొత్త బాట పట్టారు. ఎనీ డెస్క్, టీం వ్యూయర్ వంటి రిమోట్ డెస్క్ యాప్స్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, బ్యాంక్ ఐడీ, పాస్‌వర్డ్స్ తెలుసుకుని దోచుకుంటున్నారు. వినియోగదారులకు బిల్లు కట్టలేదంటూ మెసేజ్‌లు పంపి అందులోని ఫోన్ నంబర్‌కు కాల్ చేయగానే అతని ఖాతాలో ఉన్న సొమ్మును ఊడ్చేస్తున్నారు. ఈ విధమైన మోసాలు విద్యుత్ విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చాయి. ఇటువంటి మెసేజ్‌లను నమ్మవద్దని, ఎటువంటి ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు సురక్షితమైన విధానాల ద్వారా బిల్లులు చెల్లించాలని సూచిస్తున్నారు.
ఇలా చేస్తే సురక్షితం
విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ప్రజలు ఎలక్ట్రికల్ రెవెన్యూ కార్యాలయం(ఈఆర్‌ఓ), మీసేవ కేంద్రాలకు వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎనీటైం పేమెంట్ మెషీన్ (ఏటీపీ)లను డిస్కంలు ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలోని దాదాపు 1.91 కోట్ల వినియోగదారులకు సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు వాటి పేర్లతోనే మొబైల్ యాప్‌లు రూపొందించాయి. వీటి ద్వారా కొత్త సర్వీసులు, బిల్లు చెల్లింపులు వంటి సేవలు అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఇంటి నుంచే బిల్లు చెల్లించే అవకాశం లభించింది. ఫలితంగా లేట్ పేమెంట్ సర్ చార్జీల భారం తప్పుతుంది.
మాకు చెప్పండి
డిస్కంల యాప్‌లు, యూపీఐ యాప్‌ల ద్వారా గానీ, నేరుగా గానీ బిల్లు చెల్లించాలే తప్ప ఇతర మార్గాల్లో ప్రయత్నించవద్దు. విద్యుత్ శాఖ ఎవరికీ మెసేజ్‌లు పంపదు. ఫోన్ చేయమని అస్సలు
అడగదు. లైన్‌మెన్ స్వయంగా ఇంటికి వచ్చి నోటీసు ఇస్తారు. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా మెసేజ్‌లు వస్తే 1912
కాల్ సెంటర్‌కు సమాచారం అందించాలి.
– బి.మల్లారెడ్డి, విజిలెన్స్ జేఎండీ, ఏపీట్రాన్స్‌కో
Comments
Please login to add a commentAdd a comment