
ఈశ్వర్ (ఫైల్)
కోరుట్ల: బెట్టింగ్ గిల్లీ దండ ఓ పసివాడి ప్రాణం తీసింది. వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన వెంటనే కాలనీలో గొడవ జరగగా అదే ఏరియాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని పంచాయితీ చేసి, బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 5న కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట ఏరియాలో ఓ ప్రజాప్రతినిధితో సహా 10 మంది రెండు గ్రూపులుగా మారి సుమారు రూ.20 వేలు బెట్టింగ్‌తో గిల్లీ దండ ఆడారు.
ఆ సమయంలో అదే ఏరియాలో ఆడుకుంటున్న బాజి ఈశ్వర్(8) కణతకు గిల్లీ గట్టిగా తగిలింది. ఆ పసివాడు అస్వస్థతకు గురవగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మరుసటి రోజే అతను చనిపోయాడు. ఈశ్వర్ మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు గిల్లీతో కొట్టిన వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం. ఆ వెంటనే గిల్లీదండ ఆడిన ప్రజాప్రతినిధితో పాటు అదే ఏరియాకు చెందిన మరో ప్రజాప్రతినిధి జోక్యం చేసుకొని పంచా యితీ పెట్టినట్లు తెలిసింది. బాధితులపై ఒత్తిడి చేసి, గిల్లీ దండ ఆడిన వారితో రూ.1.50 లక్షలు పరిహారం ఇప్పించినట్లు సమాచారం. మంచం కోడు తగిలి ఈశ్వర్ మృతి చెందినట్లు బాధిత కు టుంబీకులు చెప్పడంతో ఆ ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment