పబ్జీ గేమ్‌కు బలైన ప్రభు (ఫైల్)
మచిలీపట్నం క్రైమ్: పబ్జీ గేమ్‌లో ఓడిపోయినందుకు అక్కలు ఆటపట్టించడంతో మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం న్యూహౌసింగ్‌బోర్డుకాలనీకి చెందిన ఊటుకూరి శాంతిరాజ్‌కు భార్య లక్ష్మీనరసమ్మతో మనస్పర్థలు రావడంతో 15 ఏళ్ల కిందట విడిపోయారు.
వీరికి హైనీ, జెన్నీఫర్, పృధ్వీరాజ్, ప్రభు (16) పిల్లలు ఉన్నారు. శాంతిరాజ్ 2008లో శ్రీరాధికను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి పాప, బాబు ఉన్నారు. మొదటి భార్య తన పెద్ద కుమారుడు పృధ్వీరాజ్‌తో కలిసి విజయవాడలో ఉంటుండగా మిగిలిన ముగ్గురు పిల్లలు శాంతిరాజ్‌తో ఉంటున్నారు. శనివారం రాత్రి పెద్ద పిల్లలు ముగ్గురూ ఇంట్లో కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు.
ఆటలో ప్రభు ఓడిపోయాడు, దీంతో అక్కలిద్దరూ ఆట పట్టించారు. దీన్ని అవమానంగా భావించిన ప్రభు పక్క గదిలో పడుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆదివారం ఉదయం పొద్దెక్కినా ప్రభు గదిలో నుంచి బయటికి రాకపోవటంతో శాంతిరాజ్ గది వద్దకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో తండ్రి శాంతిరాజ్ పోలీసులకు సమాచారం అందించారు.
నా బిడ్డది హత్యే..
ప్రభు ఆత్మహత్య విషయం తెలుసుకుని మచిలీపట్నం చేరుకున్న తల్లి లక్ష్మీనరసమ్మ తన బిడ్డది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ విలపించింది. తనకు అన్యాయం చేసినట్లే తన బిడ్డకు శాంతిరాజ్, శ్రీరాధిక అన్యాయం చేశారంటూ ఆరోపించింది. ఉరి వేసుకున్న ప్రభు మర్మావయవాల నుంచి రక్తస్రావం కావటంతో తన బిడ్డది ముమ్మాటికీ హత్యేనంటూ ఆందోళనకు దిగింది. పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టంనిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment