
ప్రతీకాత్మక చిత్రం
వక్కలగడ్డ (చల్లపల్లి) : అన్న తిట్టాడని మనస్తాపంతో నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మెరైన్ కానిస్టేబుల్ గొరిపర్తి పాండు రంగారావు కుమార్తె నాగ భార్గవికి (20) 15 నెలల క్రితం హైదరాబాద్‌లో చార్డెడ్ అకౌంటెంట్‌గా పని చేసే నెరుసు సాయి శంకర్‌తో వివాహమైంది. భార్గవి గర్భం దాల్చటంతో పుట్టింటికి వచ్చి ఉంది. తరచూ నాగభావర్గవి అన్న నిఖిల్ తన తల్లి, చెల్లితో ఏదొక విషయంలో వాదన పడుతూ ఉంటాడు.
ఈ క్రమంలో ఆదివారం భార్గవికి, నిఖిల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అన్న నిఖిల్ తిట్టడంతో మనస్థాపానికి గురైంది. దీంతో వంటింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయట ఉన్న తల్లి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి నిండు చూలాలైన కుమార్తె నాగభార్గవి ఉరికి వేలాడుతూ కనిపించడంతో హతాశురాలైంది. ఇరుగు పొరుగును పిలిచి వెంటనే మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే భార్గవి మృతి చెందింది. మృతురాలి తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ డి.సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్గవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment