సాక్షి, హైదరాబాద్ : గో కార్టింగ్ ప్లే జోన్‌లో తీవ్రంగా గాయపడ్డ శ్రీ వర్షిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కమరపల్లి మండలానికి చెందిన కాపా నాగేశ్వరరావు, మంజుల దంపతులకు కుమార్తె శ్రీవర్షిణి (21), కుమారుడు నాగప్రణీత్‌లు ఉన్నారు. నాగేశ్వరరావు మృతి చెందడంతో రెండున్నరేళ్ల క్రితం తల్లి మంజుల పిల్లలతో కలిసి రెండున్నరేళ్ల క్రితం వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. శ్రీవర్షిణి వరంగల్ కిట్స్‌లో బీటెక్ 3వ సంవత్సరం సీఎస్‌సీ గ్రూప్ చదువుతోంది. బుధవారం ఇంటికి బంధువులు రావడంతో శ్రీ వర్షిణి వారితో కలిసి సరదాగా రాత్రి 7.30 గంటల సమయంలో గుర్రంగూడలోని హస్టెన్ గో-కార్టింగ్‌కు వెళ్లారు.
కాగా శ్రీవర్షిణి బంధువుతో కలిసి రైడ్‌కు వెళ్లగా ప్రమాదవశాత్తు హెల్మెట్ జారి కింద పడగా వెంట్రుకలు టైర్లలో చిక్కుకోవడంతో కిందపడి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో వెంటనే శ్రీవర్షిణి చికిత్స నిమిత్తం గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీవర్షిణి గురువారం మధ్యాహ్నం 3.40 గంటలకు మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది...
హాస్టెన్ గో-కార్టింగ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రీవర్షిణి మృతి చెందిందని మృతురాలి సోదరుడు నాగప్రణీత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నాడు. ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపాడు.
హెల్మెట్ తీయడం వలనే ఈ ప్రమాదం
దీనిపై గో-కార్టింగ్ యాజమాన్యం స్పందిస్తూ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. నిర్వాహకుడు కిరణ్ మాట్లాడుతూ.. శ్రీ వర్షిణితో పాటు వాళ్ల బాబాయ్ నిన్న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మా కార్టన్‌కు వచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మేము కార్టన్ ఇస్తాం. శ్రీ వర్షిణి, వాళ్ల బాయ్ ఇద్దరూ ఒకే వెహికల్‌పై ఉన్నారు. ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నారు. ఒక రౌండ్ వేశాక రెండో రౌండ్‌లో శ్రీ వర్షిణి హెల్మెట్ తీసి సెల్ఫీ కోసం ప్రయత్నం చేసింది. దీంతో ఆమె వెంట్రుకలు టైర్ వీల్‌లో చిక్కుకున్నాయి. ఆమె కిందపడటంతో తలకు దెబ్బ తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గత మూడేళ్లుగా కార్టిన్ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. హెల్మెట్ తీయడం వలనే ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment