
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గుడిహత్నూర్(ఆదిలాబాద్): వేగంగా వెళ్తున ద్విచక్రవాహనం పంక్చర్ కావడంతో అదుపుతప్పింది. దానిపై ప్రయాణిస్తున్న భార్యా భర్తలు రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో భార్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఇంద్రవెల్లి మండలం సీతాగోంది వద్ద మంగళవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలం సట్వాజీగూడ సబ్ సెంటర్‌లో రెండో ఏఎన్‌ఎం బోథ్ మండలంలోని పార్డీ చంపక్‌నాయక్ తాండాకు చెందిన రాథోడ్ సునీత (38) విధులు నిర్వహిస్తోంది.
విధి నిర్వహణలో భాగంగా సట్వాజీగూడ గ్రామానికి చెందిన గర్భిణి జె.చాంగునాబాయిని చికిత్స నిమిత్తం మంగళవారం అంబులెన్సులో రిమ్స్ తరలించింది. ఇచ్చోడలోని నర్సాపూర్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న భర్త ఉత్తంసింగ్‌తో కలిసి మోటార్ సైకిల్‌పై రిమ్స్‌కు బయల్దేరింది. సీతాగోంది గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44పై మోటార్ సైకిల్ వెనుక టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. వెనుక కూర్చున్న సునీత ఒక్కసారిగా తారు రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయమై సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఉత్తంసింగ్ స్వల్పగాయాలతో బయట పడ్డాడు. స్థానికులు హైవే అంబులెన్సులో వీరిని రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment