పసి పిల్లల ఆలనా, పాలనా చూసుకోమని కేర్ టేకర్‌ని పెట్టుకుంటే సదరు మహిళ ఆ చిన్నారుల్ని చిత్రహింసలకు గురి చేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాలన్‌పూర్ పాటియా హిమగిరి సొసైటీలో నివాసముంటున్న ఓ దంపతులకు కవల పిల్లలు ఉన్నారు.
తమ ఉద్యోగం కారణంగా వారిని చూసుకోవడానికి కోమల్ తంద్లేకర్ అనే మహిళను కేర్ టేకర్‌గా నియమించుకున్నారు. అయితే సదరు మహిళ ఓ రోజు ఆ కవలల్లో ఒకరిపై తన శాడిజమ్ ప్రదర్శించింది. ఒక బిడ్డను చెవులు మెలిపెట్టడంతో పాటు చెంపలపై కొట్టి, చేతి గోర్లను కొరకడమేగాక ఆ చిన్నారిని మంచంపై విసిరిపడేసింది.
అలా ఓ ఐదు నిమిషాల పాటు కేర్‌టేకర్ పసికందును దారుణంగా కొట్టింది. ఇక ఆ దెబ్బలకు చిన్నారిలో కదలిక లేకపోవడంతో చేసేది లేక ఆ యువతి పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దాంతో చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ఆ దెబ్బలకు చిన్నారి తలలో మెదడు దెబ్బతిన్నట్లుగా వైద్యులు తెలిపారు.
అయితే తమ ఇంట్లో అప్పటికే అమర్చి ఉన్న సీసీ ఫుటేజ్‌ని పరిశీలించడంతో కేర్‌టేకర్ చేసిన నిర్వాకం బయటపడింది. ఇక వెంటనే బాధిత చిన్నారుల తండ్రి మితేష్ పటేల్ కేర్ టేకర్‌పై రాందర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో కేర్‌టేకర్ కోమల్ తంద్లేకర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment