సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసిన మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ నోరు విప్పలేదని సమాచారం. మే 1 నుంచి 4వ తేదీ వర కు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి బొల్లినేనిని తీసుకొచ్చారు. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు వేసి విచారణకు తీసుకురావడం గమనార్హం. ఈ సందర్భంగా తొలిరోజు విచారణలో సీబీఐ అధికారులకు గాంధీ ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2019 జూలైలో బొల్లినేనిపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఎన్నిసార్లు ఆదేశించినా సహకరించకపోవడంతో నాటకీయ పరిణామాల మధ్య ఏప్రిల్ 20న ఆయన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆ రోజు కూడా అనేక అనారోగ్య కారణాలు చూపి అరెస్టు తప్పించుకుందామనుకున్న గాంధీని సీబీఐ ఎట్టకేలకు అరెస్టు చేసింది. శనివారం సీబీఐ అధికారుల ప్రశ్నలకు బొల్లినేని ఎలాంటి సమాధానాలు చెప్పలేదని సమాచారం. గతంలో ఇలాంటి కేసులు ఎన్నో విచారించిన బొల్లినేని ప్రస్తుతం తానే ముద్దాయి కావడంతో కావాలనే సమాధానం చెప్పడం లేదని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment