UP: CM Yogi Orders Probe Into Killing Of Babar Celebrating BJP Win - Sakshi
Sakshi News home page

బీజేపీ వీరాభిమాని బాబర్‌ దారుణ హత్య.. యోగి సర్కార్‌ సీరియస్‌, సంబురాల్లో పాల్గొన్నందుకే..?

Published Tue, Mar 29 2022 8:10 AM | Last Updated on Tue, Mar 29 2022 9:58 AM

UP CM Yogi Orders Probe Into Killing Of Babar Celebrating BJP Win - Sakshi

బీజేపీ వీరాభిమాని ఒకరు దారుణ హత్యకు గురికావడం పట్ల సర్కార్‌ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. బీజేపీకి మద్ధతు ఇవ్వడం.. ఆపై ఎన్నికల విజయోత్సవ సంబురాల్లో పాల్గొనడంతో చుట్టుపక్కల వాళ్లే కోపంతో అతనిపై దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు.  

పోలీసుల కథనం ప్రకారం.. మార్చి 20న ఆదివారం కుషి నగర్‌ కథార్‌ఘరి గ్రామంలో బాబర్‌ అలి(25) అనే యువకుడిపై స్థానికులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బాబర్‌ను లక్నోలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ.. వారం తర్వాత బాబర్‌ కన్నుమూశాడు. అయితే అతని మృతదేహాన్ని పోలీసులు స్వస్థలానికి తీసుకురాగా.. నిందితులను అరెస్ట్‌ చేస్తేనేగానీ అంత్యక్రియలకు ముందుకెళ్లమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో న్యాయం చేస్తామని పోలీసుల హామీతో.. చివరకు బాబర్‌ అలి అంత్యక్రియలు జరిగాయి. 

బీజేపీ హార్డ్‌కోర్‌ ఫ్యాన్‌
బాబర్‌ కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ ప్రకారం.. ఆ యువకుడు బీజేపీకి వీరాభిమాని. మొన్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేశాడు. అంతేకాదు మార్చి 10వ తేదీన ఫలితాల అనంతరం.. బీజేపీ విజయంపై సంతోషంతో సంబురాల్లో పాల్గొన్నాడు కూడా. అయితే ఈ విషయమై తరచూ.. స్థానికులు అతనికి హెచ్చరికలు కూడా జారీ చేసేవారట. బీజేపీకి మద్దతు ఇచ్చినా, ప్రచారాల్లో పాల్గొన్నా బాగోదని బెదిరించేవారట. ఈ క్రమంలో ఫలితాలు వచ్చిన రోజు స్వీట్లు పంచిన టైంలోనే స్థానికులతో పెద్ద వాగ్వాదం జరిగిందని బాబర్‌ కుటుంబం చెబుతోంది. ఈ విషయమై తాము కూడా బాబర్‌ను సున్నితంగా వారించామని కానీ, అతను మాత్రం మొండిగా ముందుకెళ్లాడని బాబర్‌ తల్లి అంటోంది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని,  నిందితులను కటాకటాల వెనక్కి పంపి కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబం ప్రభుత్వాన్ని కోరుతోంది. 

స్పందించిన సీఎంవో
ఇదిలా ఉండగా.. ఈ ఘటన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ స్పందించారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్‌ చేయాలని పోలీస్‌ శాఖను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు బాబర్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సీఎంవో ట్వీట్‌ ద్వారా వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement