సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): ఇంటలిజెన్స్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రయ్య ఇంట్లో శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. చాకచక్యంగా వ్యవహరించిన అతని భార్య భాగ్యలక్ష్మి తన భర్తసాయంతో దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఎక్బాల్ హైమద్ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దుర్గం చంద్రయ్య, భాగ్యలక్ష్మి దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎక్బాల్‌హైమద్ నగర్‌లో నివాసం ఉంటున్నారు.
శనివారం తెల్లవారుజామున సదరు మహిళ వాకిట్లో ముగ్గులు వేసి ఇంట్లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. గమనించిన చంద్రయ్య కేకలు వేస్తూ పట్టుకునే ప్రయత్నం చేయగా తోసేసి పారిపోయేందుకు యత్నించాడు.
భాగ్యలక్ష్మి చాకచక్యంగా వ్యవహరించి తన భర్త సాయంతో సదరు వ్యక్తిని పట్టుకుని చెట్టుకు కట్టేసింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నారాయణ్‌నాయక్ బ్లూ కోర్ట్ సిబ్బందిని ఘటన స్థలానికి పంపించారు. సదరు వ్యక్తిని అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు మద్యం సేవించి ఉన్నాడని, విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
మా ఆయన పోలీసన్న ధైర్యంతోనే..
మా ఆయన పోలీస్ అన్న ధైర్యంతోనే దొంగను పట్టుకున్నా. దొంగతనం చేసేందుకే వచ్చిండు. మా ఆయన పట్టుకుంటే తోసేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. మా ఆయన కిందపడిపోవడంతోనే పరుగెత్తుకుని వచ్చి దొంగ ప్యాంట్, నడుము పట్టుకుని గట్టిగా లాగినా. వెంటనే మా ఆయన లేచి తాడుతో కట్టేశాడు. నేను పట్టుకోకపోతే పారిపోయేవాడు.
– భాగ్యలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment