
కష్టపడి సాగుచేయగా వచ్చిన దిగుబడితో లాభాలు రాకపోగా తీవ్ర నష్టాలు వచ్చాయి. నిండా 20 ఏళ్లు నిండని ఆ యువ రైతు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తానూరు (ముధోల్): పంటకు నష్టం వాటిల్లడంతో మనస్తాపానికి గురైన యువకుడు వాగులోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. కుభీర్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని బెల్‌తరోడా గ్రామానికి చెందిన పూరంశెట్టి శివకుమార్ (20) తన తండ్రికి సంబంధించిన రెండెకరాల వ్యవసాయ భూమిలో కూరగాయాల సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటకు నష్టం వాటిల్లింది. దీంతో శివకుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. (చదవండి: రైతు ‘ఐడియా’ అదిరింది.. సమస్య తీరింది)
శనివారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం వెతకడం ప్రారంభించగా కుభీర్ మండలం లింగి గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం, చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి జాలర్లతో వాగులో గాలించారు. దీంతో శివకుమార్ మృతదేహం బయటపడింది. కుభీర్ ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి పూరంశెట్టి నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో