ప్రతీకాత్మక చిత్రం
జయపురం(భువనేశ్వర్): ‘సార్.. పర్స్ ఇంట్లో మరచిపోయాను. చికిత్స కోసం డబ్బు అవసరం. ఫోన్ పేలో పంపించగలరు. ఉదయం 11గంటలకు తిరిగి ఇస్తా’నని కొరాపుట్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీరేష్ పట్నాయక్‌కు ఓ సైబర్ నేరగాడి నుంచి ఫోన్ వచ్చింది. పరిచయస్తుని పేరు చెప్పడంతో అతను కూడా వివిధ దఫాలుగా రూ.30 వేలు జమ చేశారు. అయితే కొద్ది సేపటికే ఫోన్ స్విచాఫ్ రావడం, డబ్బు తిరిగి జమ కాకపోవవంతో మోసపోయానని గ్రహించిన న్యాయవాది జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై బాధితుడి వివరణ ప్రకారం... మంగళవారం ఉదయం 7750874432 నంబర్ నుంచి ఫోను వచ్చింది. తనకు తెలిసిన వ్యక్తి దాస్ బాబుగా పేరు చెప్పి, ఆస్పత్రిలో ఉన్నానని.. చికిత్స కోసం డబ్బులు అవసరం కాగా, పర్స్ మర్చిపోయానని తెలిపాడు. రూ.10 వేలు అవసరం అయ్యాయని, ఇంటికి వచ్చి ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అడిగినంత ఫోన్ పే చేశారు.
కొద్ది సేపటికే మరో రూ.10 వేలు అడగ్గా, మళ్లీ బదిలీ చేశారు. అనంతరం ఫోన్ చేసి ఫోన్ పేలో రూ.30 వేలు పంపానని నకిలీ రసీదు వాట్సాప్‌కు పంపించాడు. పారపాటున రూ.10 వేలు అధికంగా జమయ్యాయని, మిగతా మొత్తం ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరడంతో తిరిగి జమ చేశారు. అయితే అకౌంట్‌లో చూడగా నగదు లేకపోవడం, సంబంధిత వ్యక్తి ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన అతను.. పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో!
Comments
Please login to add a commentAdd a comment