
సాక్షి, విశాఖపట్నం/దొండపర్తి: అమ్మాయి వలపు వలకు వేపగుంట ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణంగా మోసపోయాడు. ఆమె రొమాంటిక్‌గా మాట్లాడే సరికి ఒళ్లు మరిచిపోయాడు. నగ్నంగా కాల్ చేయమని ముద్దుగా అడిగితే మరో క్షణం ఆలోచించకుండా కాల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ న్యూడ్ కాల్ స్క్రీన్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించిన ఆ గ్యాంగ్‌కు రూ.24 లక్షలు సమర్పించుకున్నాడు. అప్పటికీ వారి బెదిరింపులు ఆపకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్ కేంద్రంగా ఈ తరహా దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి బ్యాంకు ఖాతాలు ఆధారంగా కేసును ఛేదించారు. బాధితుడిని దోచుకున్న భార్యాభర్తతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.5లక్షలు నగదు, ల్యాప్‌టాప్, 5 స్మార్ట్‌ఫోన్లు, 3 బేసిక్ ఫోన్లు, 3 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీఎంఆర్‌డీఏ భవనంలోని సైబర్ క్రైం స్టేషన్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో డీసీపీ(క్రైం) సురేష్‌బాబు కేసు వివరాలను వెల్లడించారు.
వేపగుంట ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మొబైల్‌కు గతేడాది నవంబర్ 6న ‘కాల్ మీ ఎనీటైమ్, ఐ యామ్ యువర్ బెస్ట్‌ఫ్రెండ్ టు టాక్’ అంటూ ‘55678557’ నంబర్‌కు ఫోన్ చేయాలని ఓ మెసేజ్ వచ్చింది. అది చూసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంటనే నంబర్‌కు కాల్ చేయగా ఒక అమ్మాయి రొమాంటిక్‌గా మాట్లాడుతూ.. హాఫ్ న్యూడ్ వీడియోతో ముగ్గులోకి దించింది. న్యూడ్ వీడియో కాల్ చేయమని అడిగింది. మరోక్షణం ఆలోచించకుండా న్యూడ్ కాల్ చేసి అమ్మాయితో కొంత సేపు మాట్లాడాడు. ఆ తరువాత రోజు న్యూడ్ వీడియో స్క్రీన్‌షాట్ పంపించి డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించింది.
ఆ తర్వాత.. బెదిరింపులు
డబ్బులు ఇవ్వకపోతే నగ్న వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత డబ్బులు ఇస్తూ వచ్చాడు. అప్పటి నుంచి దఫదఫాలుగా ఆ గ్యాంగ్‌కు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.24 లక్షల వరకు వేశాడు. అయినప్పటికీ వారి వేధింపులు, బెదిరింపులు ఆపకపోవడంతో ఈ ఏడాది జూలై 16న సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు వేసిన బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించారు.
వాటి ఆధారంగా నిందితులు ముగ్గురిని గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా కృష్ణా జిల్లా దబ్బకుపల్లికు చెందిన షేక్ అబ్దుల్ రహీమ్(30), హైదరాబాద్‌లో జీడిమెట్ల ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు గుండా జ్యోతి(28), గుండా వీర సతీష్(34)లు ఈ మోసానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చాడు. అక్కడ వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.5 లక్షల నగదుతో పాటు ల్యాప్‌టాప్, 8 మొబైల్ ఫోన్లు, 3 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీరిని 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ ఆర్.వి.ఆర్.కె.చౌదరి, ఎస్‌ఐ కె.రవి కిశోర్, ఏఎస్‌ఐ బి.శ్రీనివాసరావు, ఇతర సిబ్బందిని డీసీపీ(క్రైం) సురేష్‌బాబు అభినందించారు. సమావేశంలో సిబ్బంది రవికుమార్, వి. శ్రీనివాసరావు, షేక్ భాషా పాల్గొన్నారు.