ఒకసారి వాట్సాప్‌ క్రాష్‌ అయితే.. అంతే | Cyber Crime Police Investigation Over Whatsapp Chat Hack Hyderabad | Sakshi
Sakshi News home page

ఒక్కరోజే అనేక మంది వాట్సాప్‌లు ఢమాల్‌!

Published Wed, Sep 30 2020 8:08 AM | Last Updated on Wed, Sep 30 2020 12:07 PM

Cyber Crime Police Investigation Over Whatsapp Chat Hack Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు రూటు మార్చారు. ఇతరుల ఫోన్‌ నంబర్లతో తమ ఫోన్లలో వాట్సాప్‌ను యాక్టివేట్‌ చేసుకొని వాటి ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతు న్నారు. ఈ తరహా సైబర్‌ ఎటాక్‌లో భాగంగానే మంగళవారం ఒక్కరోజే హైదరాబాద్‌లో వందలాది మందికి చెందిన వాట్సాప్‌లు క్రాష్‌ అయ్యాయి. వారిలో కొందరు  సెలబ్రెటీలు సైతం ఉన్నారు. ఈ వ్యవహారంపై సైబర్‌ క్రైం పోలీసులు ఆరా తీస్తున్నారు.

అప్పట్లో ‘ఫోన్‌’ ఇప్పుడు వాట్సాప్‌...
వివిధ రకాలైన సైబర్‌ క్రిమినల్స్‌ బాధితులకు కనిపించరు. కేవలం కాల్స్, సందేశాలతో ఎర వేసి, అందినకాడికి దండుకుంటూ ఉంటారు. దీనికోసం ఒకప్పుడు ఈ సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు ఉపయోగించే వారు. అయితే ఇలా చేయడం వల్ల పోలీసులు ఫోన్‌ నంబర్‌ ఆధారంగా పట్టుకొనే అవకాశం ఉండటంతో ఇటీవల కాలంలో సైబర్‌ నేర గాళ్లు యాప్స్‌ వినియోగిస్తున్నారు. వాటితోనే కాల్స్‌ చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కువ మం ది వాడే వాట్సాప్‌ను ఎంపిక చేసుకుంటు న్నారు. ఈ యాప్‌ ‘ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రి ప్టెడ్‌’ కావడంతో సైబర్‌ నేరగాళ్లతోపాటు ఉగ్రవాదులూ వినియోగిస్తున్నారు. (చదవండి: మన వాట్సాప్ చాట్ సురక్షితమేనా?)

‘స్మార్ట్‌’ వినియోగం పెరగడంతో...
ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగింది. దీంతో సైబర్‌ నేరగాళ్లు తాజాగా వాట్సాప్‌ టేకోవర్‌ స్కామ్స్‌ మొదలెట్టారు. సైబర్‌ క్రిమినల్స్‌ తమ ఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక ఏదో ఒక సిరీస్‌ నుంచి ఓ ఫోన్‌ నంబర్‌ను వెరిఫికేషన్‌ కోసం ఎంటర్‌ చేస్తున్నారు. దీంతో వెరిఫికేషన్‌ కోడ్‌ ఆ నెంబర్‌కు వెళ్లిపోతోంది. ఆ వెంటనే నేరగాళ్లు ఆ నంబర్‌ గల వారికి ‘ఓ కోడ్‌ పొరపాటున మీ ఫోన్‌కు పంపాను. దయచేసి నాకు తిరిగి పంపండి’ అంటూ ఫోన్‌ లేదా సందేశం ద్వారా (ఇవి కూడా అడ్డదారిలో సంపాదిం చిన నంబర్లే) ద్వారా అడుగుతున్నారు. ఆరు డిజిట్స్‌తో ఉండే ఈ వెరిఫికేషన్‌ కోడ్‌ను అందుకున్న వ్యక్తి సైబర్‌ నేరగాడికి చెప్పిన వెంటనే... అతడి వాట్సాప్‌ ఖాతా సైబర్‌ నేరగాడి ఫోన్‌లోకి మారిపోతుంది. 

ఆ వెంటనే అసలు వ్యక్తి ఫోన్‌లోని వాట్సాప్‌ క్రాష్‌ అయిపోతుంది. ఇలా వాట్సాప్‌ను టేకోవర్‌ చేసిన వెంటనే సైబర్‌ నేరగాడు సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను మార్చేస్తున్నాడు. వెరిఫికేషన్‌ కోడ్‌తోపాటు హింట్‌ క్వశ్చన్‌ను అదనంగా చేరుస్తున్నాడు. దీంతో వాట్సాప్‌ అసలు యజమాని మరోసారి తన ఫోన్‌లో దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ప్రయత్నించి విఫలమవుతున్నాడు.  ఈ వాట్సాప్‌ ద్వారా సైబర్‌ నేరగాడు అమాయకులకు వాట్సాప్‌ కాల్‌ చేయడం లేదా సందేశాలు పంపడం ద్వారా వారిని బురిడీ కొట్టించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఇలా సైబర్‌ నేరగాళ్లు కొన్ని సిరీస్‌ల ఫోన్‌ నంబర్లను వరుసగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి ఒకే ప్రాంతానికి చెందిన వారి వాట్సాప్‌ ఖాతాలు క్రాష్‌ అవుతుంటాయి.

రీస్టోర్‌ చేయడం కష్టం...
వాట్సాప్‌ హ్యాకింగ్‌కు గురయ్యే ఖాతాను మళ్లీ అసలు యజమాని ఫోన్‌లో రీస్టోర్‌ చేయడం కష్టం. ఆ సంస్థకు అధికారికంగా లేఖ రాయడం ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలి. దీనికి కనీసం 45 రోజులు పడుతుంది. ఈ తరహా మోసాల బారినపడకుండా ఉండాలంటే ఫోన్లకు వచ్చే వెరిఫికేషన్‌ కోడ్స్‌ను ఎవరికీ పంపకూడదు, చెప్పకూడదు. ఒకసారి వాట్సాప్‌ క్రాష్‌ అయితే ఆ ఖాతాలోని డేటాను కోల్పోతారు.
–కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement