ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హిమాయత్‌నగర్: సైబర్‌నేరస్తులు విసిరే వలలో నగరవాసులు చిక్కి విలవిల్లాడుతున్నారు. తీరా మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ పేరిట రూ.13 లక్షలు మోసం
యూకేలో రియల్ ఎస్టేట్‌కు మంచి అవకాశాలున్నాయంటూ మెయిల్ రావడంతో అత్యాశకుపోయి రూ.13 లక్షలు పోగొట్టుకున్నాడు నగర వాసి వెంకటమరళీ మనోహర్. యూకేలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలుంటాయని, ఆసక్తి ఉంటే రావాలని కొద్దిరోజుల క్రితం వెంకటమురళీ మనోహర్‌కు మెయిల్ వచ్చింది. ఇందుకు గాను వీసా, ఇతర ఖర్చులకు రూ.13లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఆ తరువాత ఫోన్ పనిచేయకపోవడంతో బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
25 లక్షల వస్తాయని..
ఆన్‌లైన్ వేదికగా నడిచే ఎఫ్‌క్యూ యాప్‌లో అమీర్‌పేటకు చెందిన శ్రీధరరావు రూ.9.20 లక్షలు పెట్టుబడి పెట్టాడు. లాభాలు బాగావస్తాయని నమ్మి ఈ పనిచేశాడు. తరువాత రూ.25 లక్షలు లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించింది. డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా ఫలితంలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
► డేటింగ్ వెబ్‌సైట్‌లో తన ఫోన్ నెంబర్ పెట్టారంటూ నగర యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌కాల్స్ వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొంది
. మరో ఘటనలో ఓ వ్యక్తి తన ఫొటోను అతని వాట్సప్ డీపీగా పెట్టుకుని అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నారని మహిళ ఫిర్యాదు చేసింది.
►రసూల్‌పురాకు చెందిన రామ్‌కుమార్ పేరుపై కాకినాడ, చిత్తూరు ప్రాంతాల్లో రెండు బ్యాంకు ఖాతాలు ఓపెన్ అయ్యాయి. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
►డబీల్‌పురాకు చెందిన సయ్యద్ సలీమ్ తన పేరుతో ఫే స్‌బుక్, యూట్యూబ్ పేజీలను కొందరు క్రియేట్ చేసి బిజినెస్ చేసుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బ్యాంకుకే బురిడీ కొట్టి రూ.70 లక్షల రుణం
కేపీహెచ్‌బీకాలనీ: తప్పుడు ధృవీకరణ పత్రాలతో బ్యాంక్ ను మోసం చేసిన ముగ్గురిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ లక్ష్మినారాయణ తెలిపిన మేరకు.. కొండాపూర్ ప్రాంతంలో నివాసముండే కోటకొండ విక్రంబాబు(36) రుణం కోసం కేపీహెచ్‌బీకాలనీలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించాడు. సిబిల్ స్కోర్ సరిగా లేకపోవడంతో రుణం పొందడం కష్టమని బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో అతను హిమాయత్‌నగర్‌లోని చార్టర్డ్ అకౌంటెంట్ సంతోష్‌ను సంప్రదించాడు. అతను జీడిమెట్లకు చెందిన గొట్టిముక్కల సత్యనారాయణ రాజు(40)కు మాదాపూర్‌లో ప్లై హై ఎంటర్‌ప్రేజెస్ కంపెనీ ఉందని, దానికి అతనే యజమాని అన్నట్లుగా నకిలీ పత్రాలను సృష్టించాడు.
యూసుఫ్‌ఖాన్, శ్రీశైలం, చంద్రశేఖర్ అనే ముగ్గురు మధ్యవర్తుల సహకారంతో 500 గజాల ఖాళీ స్థలం ఉన్నట్లు చూపారు. వాటిని తనఖాపెట్టి రూ. 70లక్షల రుణాన్ని గొట్టిముక్కల సత్యనారాయణరాజు పేరుతో 2017 సంవత్సరంలో పొందారు. రుణం మంజూరు కాగానే సత్యనారాయణరాజు ఖాతా నుంచి విక్రంబాబు,సంతోష్‌ల ఖాతాలకు డబ్బు బదిలీ అయింది. రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు గత జనవరిలో కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి గొట్టిముక్కల సత్యనారాయణరాజును మంగళవారం అరెస్టు చేసి విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. బుధవారం విక్రంబాబును, చందానగర్‌కు చెందిన యుసుఫ్‌ఖాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
తెలిసిన వాడే కాజేశాడు!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ మాజీ ఐఏఎస్ అధికారి బ్యాంకు ఖాతా నుంచి రూ.13 లక్షలు స్వాహా చేసిన కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వీటి ప్రకారం ఆయనకు బాగా తెలిసిన వ్యక్తే ఈ పని చేసినట్లు తేల్చారు. అయితే ఈ నేరంలో ఎలాంటి సిమ్ స్వాపింగ్ జరగలేదని, తస్కరణ మాత్రం జరిగినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న అనుమానితుడిని పట్టుకోవడానికి గాలింపు ముమ్మరం చేస్తూ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ విషయంపై మాజీ ఐఏఎస్ అధికారి గత నెలలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
సాంకేతిక దర్యాప్తు నేపథ్యంలో అధికారులు కీలకాంశాలు తెలుసుకున్నారు. మాజీ అధికారి ఇంట్లో పని చేసిన వ్యక్తినే ప్రధాన అనుమానితుడిగా గుర్తించారు. ఆ సమయంలోనే యజమాని సిమ్‌కార్డు తస్కరించిన అతగాడు తన ఫోన్‌లో వేసుకున్నట్లు, దాని ఆధారంగా కొన్ని యూపీఐ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్నట్లు తేల్చారు. ఇలా ఆ సెల్‌ఫోన్ నెంబర్ లింకై ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి నగదును బదిలీ చేసుకోవడం, ఖర్చు చేయడం చేసేశాడు. ఈ పనంతా సదరు మాజీ అధికారి వద్ద పని మానేసిన తర్వాత చేశాడు. ఇలా దఫదఫాలుగా మొత్తం రూ. 13 లక్షలు కాజేసే వరకు విషయాన్ని బాధిత అధికారి గుర్తించలేదు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సదరు మాజీ పనివాడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment