బనశంకరి: ఆన్‌లైన్ చెల్లింపుల వల్ల ప్రజల పనులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. కానీ మోసగాళ్లు కూడా జనం జేబుల్ని అంతే సులభంగా ఖాళీ చేస్తున్నారు. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే కర్ణాటకలో ఏడాదికి రూ.150 కోట్లు సైబర్ నేరగాళ్ల పాలవుతోంది. 2019 నుంచి 2022 జనవరి వరకు రూ.434 కోట్లను సైబర్ వంచకులు కాజేశారు. అంటే రోజుకు రూ.39.61 లక్షలను బాధితులు కోల్పోతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారించి స్వాధీనం చేసుకుంది రూ.55 కోట్లు మాత్రమే.
సైబర్ నేరాల హబ్..
► కన్నడనాట 2021 లో ప్రజల నుంచి రూ.157 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, యూపీ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో కూర్చుని క్షణాల్లో ఫోన్ కాల్స్ ద్వారా, ఖాతా, ఓటీపీ వివరాలను తెలుసుకోవడం, మోసపూరిత లింక్‌ల ద్వారా బ్యాంకు అకౌంట్లు నుంచి కోట్లాది రూపాయలను లూటీ చేస్తున్నారు. దీంతో దక్షిణాదిలో కర్ణాటక అనేది సైబర్ నేరాల హాట్‌స్పాట్‌గా తయారైంది.
► రాష్ట్రంలో వివిధ సైబర్ పోలీస్‌స్టేషన్లలో నమోదైన 29,816 కేసుల్లో 6,673 కేసులు పరిష్కారమయ్యాయి. మిగిలిన 60 శాతం కేసులు సాక్ష్యాధారాలు లేక నత్తనడకన సాగుతున్నాయి.
► 2021లో నమోదైన సైబర్ నేరాల సంఖ్య 7,462 కి తగ్గినప్పటికీ లూటీ చేసిన మొత్తం ఎక్కువగా ఉంది. రూ.157.94 కోట్లు సైబర్ కేటుగాళ్లు దోచేశారు. ఈ ఏడాది జనవరిలో 735 మంది మోసగించి రూ.15.11 కోట్లను కాజేశారు.
మొదటి గంటలో స్పందించాలి..
సైబర్ వంచనకు గురైన ఒక గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తారు. ఈ గంటలోగా బాధితులు పోలీసులకు, బ్యాంకుల సహాయవాణికి కాల్ చేసి సమాచారం అందిస్తే బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మరింత నగదును కోల్పోకుండా చూస్తారు. అలాగే ఏ ఖాతాలకు నగదు వెళ్లిందో సులభంగా గుర్తించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment