
సీసీటీవీ దృశ్యం.. ఉత్తమ్ ఆనంద్(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ/రాంచీ: జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఓ జడ్జిని దుండగులు ఆటోతో ఢీకొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో రాష్ట్ర హైకోర్టు స్పందించి, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు ఆదేశించింది. డిస్ట్రిక్ట్, 8వ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ధన్‌బాద్‌లోని తన నివాసం నుంచి జాగింగ్‌కు బయలుదేరారు. అక్కడికి సమీపంలోని రణ్‌ధీర్ వర్మ చౌక్ వద్ద రోడ్డు పక్కన వెళ్తుండగా 7– సీటర్ ఆటో ఒకటి ఆయన్ను వెనక నుంచి ఢీకొని వెళ్లిపోయినట్లు వీడియో పుటేజీల్లో వెల్లడైంది. రక్తపు మడుగులో పడి ఉన్న జడ్జిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు ధన్‌బాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అందజేసిన లేఖను రిట్ పిటిషన్‌గా స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవి రంజన్.. సిట్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. సిట్ బృందానికి పోలీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సంజయ్ లట్కర్ నేతృత్వం వహిస్తారని డీజీపీ నీరజ్ సిన్హా హైకోర్టుకు తెలిపారు.
ఈ ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విశ్వాసం వ్యక్తం చేశారని జస్టిస్ రవి రంజన్ పేర్కొన్నారు. కాగా, జడ్జి హత్య ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేయంతోపాటు, జడ్జి మృతికి కారణమైన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, జడ్జి ఉత్తమ్ ఆనంద్‌కు నిజాయతీగా వ్యవహరిస్తారనే పేరుంది. ఇటీవల ఆయన కొందరు గ్యాంగ్‌స్టర్‌లకు బెయిల్ నిరాకరించారు. ఈ వ్యవహారంతో ఆయన మృతికి సంబంధం ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఉండగా, జడ్జి హత్య ఘటనపై విచారణను జార్ఖండ్ హైకోర్టు పర్యవేక్షిస్తున్నందున, ఈ దశలో సుప్రీంకోర్టు జోక్యం అవసరం కాకపోవచ్చని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ ఘటనను సుప్రీం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ధర్మాసనం ఎదుట ప్రస్తావించగా ఆయన ఈ మేరకు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment