సాక్షి, హైదరాబాద్: ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్ సంఘటన స్థలంలో ఎన్ని బుల్లెట్లు లభ్యమయ్యాయి? వేరే వస్తువులు ఏం సేకరించారు? అనే కోణంలో దిశ కమిషన్ విచారణ సోమవారం కొనసాగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ క్లూస్ టీం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. వెంకన్నను సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్ కమిషన్ విచారించింది. దిశ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో బాగా గడ్డి ఉండటంతో బుల్లెట్లు దొరకలేదని.. వాటి 19 కాట్రిడ్జ్‌లు మాత్రం లభ్యమయ్యాయని ఆయన వాంగ్మూలం ఇచ్చారు.
బుల్లెట్ల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాలని విచారణ అధికారి (ఐఓ) సురేందర్‌రెడ్డికి సూచించామని.. ఆయన బాంబ్ స్క్వాడ్‌తో కలసి వెతికినా కూడా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఐఓకు చేతి గ్లవ్జ్‌లు, పంచ్ మెటీరియల్‌లను ఎప్పుడు ఇచ్చారని కమిషన్ ప్రశ్నించగా.. గుర్తులేదని సమాధానం చెప్పారు. ఘటనా స్థలం నుంచి కాట్రిడ్జ్‌లు కాకుండా ఇంకా ఏం సేకరించారని అడగగా.. 9ఎంఎం తుపాకీ, రక్తం అంటిన దూది, మట్టి లభించిందని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో పోలీసులు 9 ఎంఎం తుపాకీ, ఏకే–47, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్)ను వినియోగించారని చెప్పారు.
టెంట్ ఎక్కడిది?...
అంతకుముందు ఉదయం 11 గంటలకు దిశ హత్యాచార నిందితులను సీన్–రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లే సమయంలో హాజరైన రెండో ప్రత్యక్ష సాక్షి (పంచ్ విట్నెస్) ఫరూక్‌నగర్ అడిషనల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ రహుఫ్‌ను విచారించారు.
కమిషన్: మీ కళ్లలో మట్టి పడింది కదా.. మరి ఆరీఫ్‌యే కాల్పులు జరిపాడని ఎలా చెప్పారు?
సాక్షి: శబ్దం ముందు నుంచి వచ్చింది కాబట్టి అంచనా వేశా.
కమిషన్: ఆరీఫ్ కాల్పులు జరపడం మీ కళ్లతో చూశారా? లేదా?
సాక్షి: చూడలేదు. కాల్పులు జరిపాక పోలీసులతో కలసి పక్కనే టెంట్‌లో నిల్చున్నా.
కమిషన్: ఆ సమయంలో అక్కడ టెంట్ లేదు కదా?
సాక్షి: లేదు, సీఐ చెప్పినట్లుగా కొంచెం దూరంలో నిల్చున్నా.
కమిషన్: టెంట్ ఎప్పుడొచ్చింది?
సాక్షి: తెలియదు.
కమిషన్: మీ కళ్లల్లో మట్టి పడింది కదా మరి అంబులెన్స్‌లో ఉన్న వైద్యులకు చూపించుకోలేదా?
సాక్షి: లేదు, నాకు నేను కళ్లు తుడుచుకుంటే మంటపోయింది.
కమిషన్: ఎన్‌కౌంటర్ తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి వచ్చారా?
సాక్షి: వచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు.
కమిషన్: సీపీ మృతదేహాలను చూశారా?
సాక్షి: నాకు తెలియదు.. గుర్తులేదు.
సాయంత్రం వరకూ సజ్జనార్ అక్కడే..
సోమవారం మధ్యాహ్నం సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విచారణ జరగాల్సి ఉంది. దీంతో ఉదయం 10:32 గం.కు ఆయన హైకోర్టు ఆవరణలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ, రహుఫ్ విచారణే సోమవారం కూడా కొనసాగింది. భోజనానంతరం డాక్టర్ వెంకన్న విచారణ జరిగింది. సాయంత్రం 4:02 గంటల వరకూ సజ్జనార్ వేచి ఉన్నా, సమయం లేకపోవడంతో విచారణ వాయిదా పడింది. గురు లేదా శుక్రవారం ఆయన్ను విచారించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment