సాక్షి, చెన్నై: విడాకులు కోరిన భార్యను అతి కిరాతకంగా ఓ భర్త మట్టుబెట్టాడు. విచక్షణారహితంగా కత్తితో పొడవడమే కాదు, కారుతో కడుపుమీద ఎక్కించి మరీ హత్య చేశాడు. ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన ఆ భర్త ఓ డాక్టరు కావడం గమనార్హం. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోయంబత్తూరుకు చెందిన గోకుల్‌కుమార్(40) కాటాన్ కొళత్తూరులోని ఓ ఆస్పత్రిలో డాక్టర్. మరో ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న సమీప బంధువు కీర్తనను ప్రేమించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేరు. చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలోని కృష్ణప్రియనగర్‌లో నివాసం ఉంటున్న కీర్తన తల్లి కుమారి, తండ్రి మురహరి ఇంట్లోనే ఇల్లరికం అల్లుడిగా తొలుత గోకుల్ కుమార్ ఉండేవాడు. ఇటీవల కీర్తనతో అభిప్రాయబేదాలు రావడంతో ఇద్దరు కలిసి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
శుక్రవారం కీర్తన ఇంటికి వెళ్లిన గోకుల్ కుమార్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని అడ్డొచ్చిన మామ మురహరిపై దాడి చేశాడు. కీర్తనను విచక్షణారహితంగా పొడిచి గొంతు కోసి బయటకు లాక్కొచ్చి, కారుతో ఆమెపై దూసుకెళ్లి హతమార్చేశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న మధురాంతకం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ మురహరిని ఆస్పత్రికి, కీర్తన మృత దేహాన్ని మార్చురికి తరలించారు. కాగా, జాతీయ రహదారిలో కారులో తప్పించుకెళ్తున్న సమయంలో గోకుల్‌కుమార్ ప్రమాదానికి గురయ్యాడు. టోల్‌గేటు వద్ద కారు బోల్తాపడడంతో గాయపడి, చెంగల్పట్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment