
అనాథనంటూ పెళ్లి చేసుకుని మోసాలకు పాల్పడుతున్న సుహాసిని
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అనాథనని చెబుతూ పెళ్లి పేరుతో యువకులను మోసం చేస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె పలువురిని మోసం చేసినట్లు తెలుస్తుండగా, ఆ మహిళ వలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు యువకుడు చిక్కుకుని మోసపోయాడు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన సుహాసినిని పోలీసులు తిరుపతిలో అలిపిరి వద్ద అరెస్టు చేయగా, మణుగూరులో కూడా కేసు నమోదైనందున శుక్రవారం ఇక్కడకు తీసుకొచ్చా రు. వివరాలను మణుగూరు ఏఎస్పీ ఎం.శబ రీష్ వెల్లడించారు.
తొలుత మేనమామతో వివాహం
ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పాల సుహాసినికి తొలుత మేనమామతో వివాహం జరిగింది. ఆపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీకే – 1 సెంటర్‌లో నివాసం ఉంటున్న దేవరకొండ వినయ్‌కు తాను అనాథనంటూ పరిచయం చేసుకుంది. దీంతో ఆయన 2019 మే 23న స్థానిక కిన్నెర కళ్యాణ మండపంలో సుహాసినిని వివాహం చేసుకున్నాడు. కొంత కాలం మంచిగానే ఉన్న ఆమె రూ.1.5లక్షల నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు తీసుకొని వెళ్లిపోయింది. మోసపోయినట్లు గుర్తించిన వినయ్ గతనెల 16న మణుగూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
కాగా, తిరుపతిలో ప్రైవేట్ ఉద్యోగం చేసే సునీల్‌కుమార్‌తోనూ సుహాసిని ఇలాగే పరిచయం పెంచుకోగా, ఆయన సైతం తల్లిదండ్రుల్ని ఒప్పించి సుహాసినిని పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో అత్తమామలు ఆమెకు 10 తులాల బంగారం పెట్టారు. వివాహమైన కొద్దిరోజులకు తన చిన్నప్పటి నుంచి ఆదరించిన వారి ఆరోగ్య అవసరాలకు అవసరమని చెప్పి భర్త, అత్తమామల నుంచి రూ.6 లక్షలు తీసుకుంది. కొన్నాళ్లకు భర్త ఆమెను నిలదీయగా.. మరుసటి రోజే ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆయన అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది. తిరుపతికి చెందిన సునీల్ ఫిర్యాదుతో అలిపిరిలో ఆమెను అరెస్టు చేయగా, మణుగూరులో కేసు ఉండడంతో ఇక్కడకు తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment