
లక్ష్మణ్ (ఫైల్)
సాక్షి, సారంగాపూర్(కరీంనగర్): జిల్లాలో మరో హత్య జరిగింది. మూఢనమ్మకాలు, పాతకక్షల నేపథ్యంలో గతనెల 20న జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌కు చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను అత్యంత దారుణంగా చంపిన ఘటనను మరువక ముందే ఈ హత్య జరగడంతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో లచ్చనాయక్ తండాకు చెందిన భూక్య లక్ష్మణ్ (24) చనిపోయాడు.
జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్ కథనం ప్రకారం.. లక్ష్మణ్ గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 5 గంటలకు సేవాలాల్ భవనంలో మైక్ ఆన్ చేసేందుకు బయలు దేరాడు. తన ఇంటి ఎదుట నుంచి వెళ్తున్న లక్ష్మణ్‌పై భూక్య సురేందర్ రాడ్డుతో దాడి చేశాడు.
తలపై బలంగా బాదడంతో లక్ష్మణ్ కుప్పకూలి, అక్కడికక్కడే మృతిచెందాడు. రక్తం చిమ్మి సమీప ఇంటిగోడలపై పడింది. తనకు రామ్, లక్ష్మణ్ కవల పిల్లలని, ఇద్దరికీ వివాహాలు చేయాలని అనుకుంటున్న తరుణంలో ఇలా హత్యకు గురయ్యాడని మృతుడి తల్లి అమ్మి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని సమాచారం. నిందితుడితోపాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
చదవండిః కామాంధుడిని ఎన్‌కౌంటర్ చేయండి.. తల్లడిల్లిపోతున్న దీక్షిత తల్లిదండ్రులు