సిరిసిల్ల మానేరువాగులో కొనసాగుతున్న గాలింపు చర్యలు. (ఇన్‌సెట్‌లో) గణేశ్ (ఫైల్)
సిరిసిల్ల: సరదాగా 8 మంది స్నేహితులు మానేరు వాగులో ఈతకు వెళ్లారు.. ఒకరి వెంట ఒకరు ఐదుగురు అందులో దూకారు.. లోతు ఎక్కువగా ఉండటంలో దూకిన విద్యార్థులంతా గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా, మిగతా నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి శివారులోని మానేరు వాగులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఈ విద్యార్థులంతా జిల్లా కేంద్రంలోని కుసుమ రాజయ్య జెడ్పీ హైస్కూల్‌లో చదువుతున్నారు.
పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటకు ఇంటికి వెళ్లిన పిల్లల్లో 8 మంది భోజనం చేసి మానేరు వాగు వద్దకు ఈతకు వెళ్లారు. ముందుగా రాజీవ్‌నగర్‌కు చెందిన కొలిపాక గణేశ్(15), జడల వెంకటసాయి(14), తీగల అజయ్(14), కొంగ రాకేశ్ (15) శ్రీరామ్ క్రాంతి (14) వాగులోకి దూకారు. నీరు లోతుగా ఉండటంతో వారంతా గల్లంతయ్యారు. దీంతో భయపడిన సింగం మనోజ్(14), దిడ్డి అఖిల్(15)తోపాటు మరో బాలుడు అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వాగులో గాలించగా.. గణేశ్ మృతదేహం లభ్యమైంది. వెంకటసాయి, అజయ్, రాకేశ్, శ్రీరామ్ క్రాంతిల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈత కోసం వెళ్లిన ఐదుగురు స్నేహితులు నీటిలో గల్లంతవడం సిరిసిల్ల పట్టణంలో విషాదాన్ని నింపింది. సోమవారం రాత్రి వరకు నలుగురి పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఓ వైపు వర్షం.. మరోవైపు చిమ్మచీకటి.. ఇంకోవైపు మత్తడి దూకుతున్న వరద.. ఇలాంటి పరిస్థితిలోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment