క్వారీలో గుంతలో నలుగురు గల్లంతు.. ఆరిన ఆశల దీపాలు! | Four Friends Drowned In A Quarry Pit in Guntur | Sakshi
Sakshi News home page

క్వారీలో గుంతలో నలుగురు యువకుల గల్లంతు.. ఆరిన ఆశల దీపాలు!

Published Tue, Jul 13 2021 7:51 AM | Last Updated on Tue, Jul 13 2021 2:11 PM

Four Friends Drowned In A Quarry Pit in Guntur - Sakshi

సాక్షి,గుంటూరు(ప్రత్తిపాడు): చదువు పూర్తయితే కొడుకు ఉన్నత స్థానంలో నిలుస్తాడని ఒకరు.. కొడుకు చేస్తున్న కోర్సు పూర్తయితే తన కాళ్ల మీద తాను నిలబడతాడని ఇంకొకరు.. అల్లరి చిల్లరిగా తిరిగే కొడుకు ఇప్పుడిప్పుడే గాడిన పడుతుండటం చూసి మరొకరు.. తమపై పూర్తిగా ఆధార పడకుండా తన కష్టంతో తాను సంపాదించుకోవడం మరొకరు.. ఇలా.. ఇరవై ఏళ్లుగా కంటికిరెప్పలా, తమ కనుపాపల్లా అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలపై ఎన్నో ఆశలు.. మరెన్నో కలలు.. తల్లిదండ్రులు ఒకటి తలస్తే, విధి మరొకటి తలచింది. తల్లిదండ్రుల ఆశలను క్వారీ నీళ్లలో చిదిమేసింది. కలలను కన్నీళ్లతో నులిమేసింది. తమ ఇంటి ఆశల దీపాలను ఆర్పేసింది.

పున్నామ నరకం నుంచి తప్పిస్తారనుకున్న తనయులు తమకన్నా ముందే కానరాని లోకాలకు వెళ్లడంతో, ఆ కుటుంబాల్లో పెను విషాదం అలుముకుంది.  ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద క్వారీ గుంతలో ఆదివారం సాయంత్రం గల్లంతైన నలుగురు యువకులను మృత్యువు కబళించిది. అర్థరాత్రి నుంచి సోమవారం ఉదయం తొమ్మిదిన్నర వరకూ విస్తృతంగా గాలించి సిద్ధంశెట్టి వెంకటేష్, ఇగుటూరి వీర శంకర్‌ రెడ్డి, బిళ్లా సాయిప్రకాష్, లంబు  వంశీల మృతదేహాలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం బయటకు తీసింది.

ఆటంకాలు ఎదురైనప్పటికీ గుంటూరు ఆర్డీవో భాస్కర్‌ రెడ్డి, అర్బన్‌ సౌత్‌ జోన్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, తహసీల్దార్‌ ఎం.పూర్ణచంద్రరావు, ఎస్‌ఐ అశోక్‌లు నేతృత్వంలో సిబ్బంది దాదాపుగా 11 గంటల పాటు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపట్టారు. తదనంతరం రుద్ర ట్రస్టు సభ్యుల సహకారంతో ప్రత్యేక వాహనాల్లో మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కు తరలించి,  పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరణించిన వారంతా యువకులే కావడంతో వారి అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. వందలాది మంది స్నేహితులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు వారి వెంట నడిచి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు.

ఆస్తులన్నీ నాకే ఇచ్చేస్తా అన్నావు కదా అన్నయ్య!
బిళ్లా సాయిప్రకాష్‌ది చిన్న కుటుంబం. తండ్రి ఏడుకొండలు కేబుల్‌ ఆపరేటర్‌గా, తల్లి కనకదుర్గ అంగన్‌వాడీ ఆయాగా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇటీవలే సాయిప్రకాష్‌ స్థానికంగా ఉన్న పురుగు మందుల దుకాణంలో చిన్న ఉద్యోగంలో చేరాడు. అమ్మా.. చెల్లికి సంబంధాలు చూస్తున్నారు కదా. మంచి సంబంధం కుదిరితే మనకున్న కొద్దిపాటి ఆస్తులు కూడా చెల్లికే ఇచ్చేద్దాం. నాకేమీ వద్దు. నేను కష్టపడి సంపాదించుకుంటాను అని పదే పదే అనేవాడు.  ఆస్తులన్నీ ఇచ్చేస్తా అన్నావ్‌.. చివరకు నీ ఒంటి మీద బట్టలు కూడా ఇచ్చి వెళ్లావా అంటూ కన్నీటి పర్యంతమవుతూ చెల్లినాగలక్ష్మి విలపించడం అందరినీ కదిలించివేసింది.

ఎవరికి ఆపదన్నా పరిగెడతావే..! 

లంబు వంశీది కూడా మధ్యతరగతి కుటుంబమే. తండ్రి శ్రీనివాసరావు, భార్య దేవిశ్రీవల్లి. వీరికి ఇద్దరు సంతానం. పెద్దవాడు వంశీ వట్టిచెరుకూరు మండ లం పుల్లడిగుంటలోని మలినేని ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వంశీ కళాశాలకు వెళుతూనే అప్పుడప్పుడూ కూలి పనులకు కూడా వెళుతుండేవాడు. చుట్టాలు గానీ, స్నేహితులు గానీ ఎవ్వరు ఏ ఆపద వచ్చిందన్నా, సమస్య వచ్చిందన్నా ముందుంటావే.. అలాంటి నీకే ఎంత కష్టమొచ్చిందయ్యా.. దేవుడినే నమ్ముతావే.. ఇప్పటికీ దేవుడి బొమ్మ మెడలోనే ఉంచుకుంటావే..   అంటూ కన్నీటి కుటుంబ సభ్యులు పర్యంతమయ్యారు.


కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్న సమయంలో..

ఇగుటూరి వీరశంకర్‌ రెడ్డిది కూడా రైతు కుటుంబమే. తండ్రి కోటి రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. తల్లి గృహిణి. వీరికి కొడుకు, కుమార్తె. వీర శంకర్‌ రెడ్డి గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. మొన్నటి వరకూ అతి తక్కువ జీతమే. అయితే కరోనా కావడంతో ఆస్పత్రిలో రేయింబవళ్లు అధిక డ్యూటీలు చేస్తూ నాలుగు రూపాయలు అధికంగా సంపాదించుకుంటున్నాడు. వచ్చిన దానిలో కొంత తన ఖర్చులకు ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని తల్లిదండ్రులకు ఇచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అకాల మృత్యువు మాటువేసి కబలించడంతో కుటుంబ సభ్యుల రోదన వర్ణణాతీతంగా ఉంది.

ఉద్యోగం వస్తే చెల్లి పెళ్లి ఘనంగా చేద్దామన్నావే.. !
సిద్దంశెట్టి వెంకటేష్‌ది రైతు కుటుంబం. తండ్రి సాంబయ్య అరకలకు వెళుతూ, తల్లి వ్యవసాయ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉన్నదానిలోనే పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించారు.. కుమారుడు వెంకటేష్‌ హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇటీవలే చెల్లికి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీటికుంట రూపంలో మృత్యువు కబళించింది. చెల్లికి సంబంధం కుదిరేలోగా, నాకు మంచి జాబ్‌ వస్తుంది. చెల్లిపెళ్లి ఘనంగా చేద్దామని అమ్మతో చెప్పావే.. ఇప్పుడు నీ తోడబుట్టిన దాని పెళ్లి కూడా చూడకుండానే వెళ్లిపోయావా.. వెంకటేషా.. అంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

హోంమంత్రి సుచరిత దిగ్భ్రాంతి
 ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద జరిగిన క్వారీ ఘటనలో యువకులు మృత్యువాతకు గురవ్వటంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్వారీలో ఈతకు వెళ్లి వ్యవసాయ కూలీ కార్మికుల యువకులు మృతి చెందటం విస్మయానికి గురిచేసిందన్నారు. ఒకేసారి నాలుగు కుటుంబాల్లో విషాదం జరగటం    ఎంతో బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదకరమైన క్వారీలలో ఈతలకు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టి మరోసారి ప్రమాదం జరగకముందే ప్రమాదకరమైన స్థలాలని బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement