
చండిగఢ్: హరియాణాలో అమానుషం చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిందో తల్లి. పోలీసుల సమాచారం ప్రకారం నలుగురు మైనర్ బాలికలను గొంతుకోసి మరీ దారుణంగా హతమార్చింది. వీరి వయసు ఒకటి నుంచి ఏడు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అనంతరం ఆమెకూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నుహ్ జిల్లాలోని పిప్రోలి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. బాధిత బాలికల తండ్రి ఫిర్యాదు ఆధారంగా తల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న తల్లి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇంత దారుణానికి ఆమె ఎందుకు పాల్పడిందో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి సమర్జీత్ చెప్పారు.