ప్రతీకాత్మక చిత్రం
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఓ అమ్మాయి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య నెలకొన్న వివాదం జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడి హత్యకు దారితీసింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన విజయవాడలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం నగరంలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన గిలక దీపక్ ఆకాష్ (24) జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆకాష్, గోపీకృష్ణ అలియాస్ ప్రభ, మరికొందరు కలిసి నగరంలోని కళాశాలలో చదువుకునే రోజుల నుంచి స్నేహితులు. ఆకాష్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె పేరును తన పొట్టపై పుట్టుమచ్చ కూడా వేయించుకున్నాడు.
చదవండి: మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. నగదు, ఇంటి కాగితాలు తీసుకుని..
ఈ అమ్మాయి విషయంలో ఆకాష్, గోపీకృష్ణల మధ్య గత రెండేళ్లుగా ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన టోనీ అనే రౌడీషీటర్ మృతదేహాన్ని చూడడానికి మంగళవారం మధ్యాహ్నం ఆకాష్ తన ఏడుగురు స్నేహితులతో కలసి ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. ఆస్పత్రి సమీపంలో ఉన్న మద్యం షాపులో ఆకాష్ మద్యం తాగుతుండగా, అదే ప్రాంతంలో మరో ఇద్దరు స్నేహితులతో కలసి అక్కడ ఉన్న గోపీకృష్ణ మరోసారి ఆకాష్‌తో గొడవ పడ్డాడు. నీ సంగతి చూస్తానంటూ గోపీకృష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో మద్యం బాగా తాగి ఉన్న ఆకాష్‌ను అతని స్నేహితులు బైక్‌పై ఎక్కించుకుని గురునానక్ కాలనీలో ఉంటున్న మరో స్నేహితుని ఇంట్లో దించి వెళ్లిపోయారు.
ఆ సంగతి తెలుసుకున్న గోపీకృష్ణ కొంతమంది స్నేహితులను వెంటబెట్టుకుని గదిలో నిద్రిస్తున్న ఆకాష్‌ను కత్తులతో పొడిచి చంపి పరారయ్యాడు. ఆకాష్ స్నేహితుడు వెంటనే అతనిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆకాష్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆకాష్ హత్యపై అతని తల్లి పటమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ హత్యలో తొమ్మిది మంది పాల్గొన్నట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. వీరిలో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరంతా గుణదలకు చెందిన వారుగా గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. హతుడి ఫోన్ డేటాను పరిశీలించిన అనంతరం గుంటూరు, ప్రకాశం జిల్లా టంగుటూరు, నెల్లూరు ప్రాంతాలకు వీరిని పంపి నిందితుల కోసం గాలిస్తున్నారు. హతుడు, నిందితులు కూడా మంగళవారం ఆత్మహత్య చేసుకున్న రౌడీషీటర్ టోనీ అనుచరులుగా పోలీసులు గుర్తించారు. కేసును విజయవాడ సెంట్రల్ జోన్ ఏసీపీ షేక్ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ఆకాష్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment