లాలాపేట పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతున్న అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, వెనుక ముసుగులో నిందితులు
గుంటూరు ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనుగుణంగా ఆధార్ కార్డుల్లో తమకు అవసరమైన విధంగా.. అక్రమంగా వయసు పెంచుతూ.. తగ్గిస్తూ అడ్డగోలుగా డబ్బులు దండుకుంటున్న ముఠా గుట్టును గుంటూరు పోలీసులు రట్టు చేశారు. గుంటూరు లాలాపేట పోలీస్టేషన్‌లో బుధవారం అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి వివరాలను వెల్లడించారు. గుంటూరులోని కాకాని రోడ్డులో ఉన్న సిటీ మార్కెట్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో కొంతమంది వ్యక్తులు గది అద్దెకు తీసుకుని ప్రభుత్వ ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, వాటిపై నకిలీ స్టాంపులు వేసి, ఆధార్ కార్డులో వ్యక్తుల వయస్సు పెంచుతూ రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు దండుకుంటున్నారనే ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం దాడి చేసి 8 మంది నిందితులను అరెస్టు చేశారు. అమరావతికి చెందిన అడపాల సాయి, గుంటూరు ఆనందపేటకు చెందిన షేక్ ఖాజా ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆధార్ అప్‌డేట్ సంస్థ ప్రతినిధులుగా పనిచేస్తున్నారు.
ఆ అనుభవంతో ఆర్టీసీ కాలనీకి చెందిన ఆవుల తిరుపతిరెడ్డి, అమరావతికి చెందిన రాఘవరపు సాయిశేషు, గుంటూరు రామిరెడ్డి తోటకు చెందిన అన్నపురెడ్డి సాయికుమార్, పాతగుంటూరుకు చెందిన నిశ్శంకరరావు శివన్నారాయణ, అమరావతి మండలం మునుగోడు గ్రామానికి చెందిన గడపా వెంకటనాగిరెడ్డి, గుంటూరు రూరల్ మండలం శివారెడ్డిపాలేనికి చెందిన పోలిశెట్టి దుర్గాప్రసాద్ మరికొంతమందితో కలిసి అక్రమంగా ఆధార్ కార్డుల్లోని మార్పులు చేర్పులు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. చదువులేని వ్యక్తులను టార్గెట్ చేసి వైఎస్సార్ చేయూత పథకానికి సరిపోయే వయస్సును ఆధార్‌లో మార్పుచేసి పెడతామని నమ్మిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 500 మంది ఆధార్ కార్డుల్లో వయసును మార్చారు.
కొన్ని దరఖాస్తులు ఆన్‌లైన్‌లో తిరస్కరణకు గురయ్యాయి. అర్బన్ ఎస్పీకి నిఘా వర్గాల ద్వారా సమాచారం రావడంతో ప్రత్యేక బృందాలను నియమించి విచారణ చేయించి అరెస్టు చేశారు. అర్బన్ పరిధిలో మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని ముఠాలు ఆధార్ కార్డుల్లో వయస్సు మారుస్తున్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఆధార్లో మార్పులు చేర్పులు ఆధార్ సేవాకేంద్రాలు, బ్యాంకుల్లోనే సరిచేయించుకోవాలని సూచించారు. నిందితుడు ఖాదర్ బాషా కరోనా చికిత్స పొందుతున్నందున అతనికి స్వస్థత చేకూరిన అనంతరం అరెస్టు చేస్తామన్నారు. నిందితుల బ్యాంకు అకౌంట్లు సీజ్ చేయడంతోపాటు ఏసీఈఆర్ ల్యాప్ ట్యాప్, ఐరిష్ కెమెరా, లాగిటెక్ కెమెరా, బయోమెట్రిక్ ఐరిష్ స్కానర్లు రెండు, ఫింగర్ స్కానర్, కలర్ ప్రింట్ కమ్ స్కానర్, 10 నకిలీ రబ్బరు స్టాంపులు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రబ్బరు స్టాంపులు, ఇతర సాంకేతిక సామగ్రి, రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల అకౌంట్లలో ఉన్న రూ.2,42,264ను బ్యాంకు అధికారుల సహాయంతో త్వరలో సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కేసు పురోగతిలో కృషి చేసిన పాతగుంటూరు ఎస్‌హెచ్‌వో సురేష్‌బాబు, ఎస్‌ఐలు టి.నాగరాజు, షేక్ ఎం.డి.మేరాజ్, టి.వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు, కానిస్టేబుల్ మణిప్రసాద్, కిరణ్‌కుమార్, కె.వినోద్, వై.నాగార్జునను ఎస్పీ అభినందించారు
Comments
Please login to add a commentAdd a comment