దారుణం: రూ.కోటిస్తేనే కాపురం చేస్తాడట! | Husband Dowry Harassment On Wife In Anantapur District | Sakshi
Sakshi News home page

దారుణం: రూ.కోటిస్తేనే కాపురం చేస్తాడట! 

Published Thu, Oct 15 2020 12:13 PM | Last Updated on Thu, Oct 15 2020 5:58 PM

Husband Dowry Harassment On Wife In Anantapur District - Sakshi

సాక్షి, ధర్మవరం (అనంతపురం): అదనపు కట్నం కింద రూ.కోటి ఇస్తేనే కాపురం చేస్తానని, లేకుంటే విడాకులు ఇవ్వాలని భర్త బెదిరిస్తున్నాడని ఓ వివాహిత మెట్టినింటి ఎదుట ఆందోళనకు దిగింది. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన తనకు కూతురు పుట్టి ఏడాది అయినా మెట్టినింటి వారు ఒక్కరు కూడా తిరిగి చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తానే కూతురుతో కలిసి వస్తే లోనికి రాకుండా తలుపులు వేసేశారని విలపించింది. తనకు భర్త కావాలని పోలీసులను వేడుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

కడపకు చెందిన కొల్లి వెంకటరమణ, శ్రీదేవి దంపతుల కుమార్తె గాయత్రికి ధర్మవరం పట్టణం సత్యసాయినగర్‌లో నివసిస్తున్న రిటైర్డ్‌ ఎల్‌ఐసీ ఆఫీసర్‌ గుర్రం విజయ్‌కుమార్, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు గుర్రం దీపక్‌కుమార్‌తో 2018 డిసెంబర్‌ 27న వివాహమైంది. అప్పట్లో రూ.20లక్షలు కట్నం, రూ.10 లక్షలు విలువ చేసే బంగారు నగలను అందజేశారు. దీపక్‌కుమార్‌ బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండేవాడు. పెళ్లి అయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడు. రూ. కోటి తీసుకురాకపోతే విడాకులు ఇస్తానంటూ బెదిరించేవాడు.

దీపక్‌కుమార్, గాయత్రిల పెళ్లినాటి ఫొటో   
భర్త, అత్త, మామలతో పాటు ఆడపడుచులు లిఖిత, రచనలు కూడా అదనపు కట్నం కోసం వేధించేవారు. గర్భం దాల్చిన గాయత్రిని ప్రసవం కోసం పుట్టింటికి పంపించారు. అనంతరం దీపక్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి.. గంజాయి వ్యాపారం మొదలుపెట్టాడు. విషయం తెలిసిన వెంటనే గంజాయి వ్యాపారం చేయడం తప్పని చెబితే వినకపోగా భార్యను మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. గత ఏడాదే భార్య డెలివరీ అయి పండంటి బిడ్డకు జన్మనిచ్చినా చూసేందుకు కూడా వెళ్లలేదు. భర్త తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని గాయత్రి కడప పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అక్కడి పోలీసులు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి.. చక్కగా కాపురం చేసుకోవాలని సూచించారు.

భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్న గాయత్రి  

అత్తారింటి ముందు ఆందోళన.. 
పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా భర్త వైఖరిలో మార్పు రాలేదు. తనకు విడాకులు కావాలంటూ గాయత్రికి ఇటీవల నోటీసు పంపించాడు. అప్పటి నుంచి ఆమె తన భర్తకు, మెట్టినింటి వారికి ఫోన్‌ చేస్తుంటే తీయడం లేదు. దీంతో చేసేదిలేక గాయత్రి తన కూతురితో కలిసి ధర్మవరం వచ్చింది. అయితే అత్తమామలు ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు మూసేశారు. భర్త కూడా ఆ సమయంలో లేరు. దీంతో ఆమె ఆ ఇంటి ముందే పాపతో కలిసి ఆందోళన చేపట్టింది. తన భర్త గంజాయి వ్యాపారం చేస్తున్నాడని, అది తప్పని చెప్పినందుకు తనను ఎలాగైనా వదిలించుకునేందుకు అదనపు కట్నం పేరిట వేధిస్తున్నారని గాయత్రి ఆవేదన వ్యక్తం చేసింది. 

మరోసారి కౌన్సెలింగ్‌ ఇస్తాం 
అత్తారింటి ముందు కూతురుతో కలిసి గాయత్రి ఆందోళన చేస్తున్న విషయం తెలియగానే అర్బన్‌ పోలీసులు వారిని స్టేషన్‌కు పిలిపించారు. ఆమెకు జరిగిన అన్యాయంపై డీఎస్పీ రమాకాంత్, అర్బన్‌ సీఐ కరుణాకర్‌లు విచారణ చేశారు. విడాకులకు భర్త దరఖాస్తు చేసుకున్నందున మరోసారి దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇద్దరినీ కలిసి ఉండేలా చూస్తామని డీఎస్పీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement