కళ్యాణదుర్గం: అనుమానం పెనుభూతమైంది. పదకొండేళ్లుగా ఎలాంటి కలహాలు లేని కాపురంలో చిచ్చు రేపింది. చివరకు ఇల్లాలిని బలిగొంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లికి చెందిన నాగార్జున, సరస్వతి(32) దంపతులు. 11 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి 8 ఏళ్ల కుమారుడు, 4 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కుటుంబం సాఫీగా సాగిపోతున్న తరుణంలో భార్య ప్రవర్తనపై నాగార్జునకు అనుమానం మొదలైంది.
రోజులు గడిచే కొద్దీ నాగార్జున ఆలోచనలు మారుతూ వచ్చాయి. ఎలాగైనా భార్యను హతమార్చాలని నిర్ణయించుకుని... ఆదివారం రాత్రి గాఢ నిద్రలో ఉన్న సరస్వతి తలపై గుండ్రాయి వేసేందుకు ప్రయతి్నంచాడు. ఆ సమయంలో పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే సరస్వతి తలపై గుండ్రాయి వేసి, నాగార్జున పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సరస్వతిని కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
విషయం తెలుసుకున్న సీఐ తేజమూర్తి ఆస్పత్రికి చేరుకుని సరస్వతిని పరిశీలించారు. వైద్యుల సూచన మేరకు ఆమెను వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నాగార్జున కోసం గాలింపు చేపట్టారు.
భర్తపై హత్యాయత్నం
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తపై భార్య హత్యాయత్నం చేసింది. సీఐ తేజమూర్తి తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం మల్లాపురానికి చెందిన శివయ్య అలియాస్ శివారెడ్డి, మమత దంపతులు. అదే గ్రామానికి చెందిన కర్రెన్నతో కొంత కాలంగా మమత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఈ విషయంగా భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు సిద్ధమైంది. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న భర్త గొంతు కత్తితో కోసేందుకు సిద్ధం కాగా, అదే సమయంలో శివయ్య నిద్రలేచాడు. దీంతో ఇద్దరూ పారిపోయారు. శివయ్య గొంతుపై చిన్న గాటు పడడంతో ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై శివయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: కల్తీ మద్యం తాగి 18 మంది కూలీలు మృతి)
Comments
Please login to add a commentAdd a comment