
థానే: ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇడ్లీలు అమ్మె ఓ వ్యక్తితో రూ.20 కోసం గొడవపడి దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా మీరా రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరేంద్ర యాదవ్ అనే ఓ వ్యక్తి రోజు మీరా రోడ్డులో ఇడ్లీలు అమ్ముతూ ఉంటాడు. అయితే శుక్రవారం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వద్దకు వచ్చి ఇడ్లీలు తిన్నారు. అనంతరం వారు వీరేంద్ర యాదవ్‌తో రూ. 20 కోసం వాదన దిగారు. ఈ వాదన కాస్త పెద్ద గొడవకు దారితీయటంతో ఆ వ్యక్తులు కోపంతో వీరేంద్ర యాదవ్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో వీరేంద్ర యాదవ్‌ను వారు కిందకు తోసేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
దాడికి పాల్పడిన వ్యక్తులు ఘటన స్థలం నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు వీరేంద్ర యాదవ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. మీరా రోడ్డులోని నయా నగర్ పోలీసులు ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment