Janasena, TDP, BJP Conspiracy In Amalapuram Attacks: AP - Sakshi
Sakshi News home page

Amalapuram: జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు

Published Fri, May 27 2022 4:26 AM | Last Updated on Fri, May 27 2022 3:53 PM

Janasena TDP BJP Conspiracy In Amalapuram Attacks - Sakshi

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ర్యాలీలో నినాదాలు చేస్తున్న అల్లర్ల నిందితుడు, జనసేన కార్యకర్త అన్యం దుర్గా సాయికుమార్‌ (ఫైల్‌)

సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్‌: అమలాపురంలో అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సాగిన విధ్వంసకాండ కుట్ర వెనుక సూత్రధారులు, దాడుల్లో పాత్రధారులను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వీడియో క్లిప్పింగులు, సోషల్‌ మీడియా పోస్టులు, కాల్‌ డేటా, సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా 70 మందికిపైగా నిందితులను గుర్తించారు. ఇందులో భాగంగా గురువారం ఒక్కరోజే 19 మందిని అరెస్టు చేశారు.

మరో 46 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు.. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట రామారావు ఉన్నారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప అనుచరుడు వడగన నాగబాబుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

ఈ విషయాన్ని డీఐజీ పాలరాజు మీడియాకు తెలిపారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో కోనసీమ, కాకినాడ జిల్లా ఎస్పీలు కెఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, ఎం.రవీంద్రనాథ్‌బాబు, కోనసీమ ఏఎస్పీ లత మాధురితో కలిసి పాలరాజు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న అమలాపురం పట్టణంలో పలు కూడళ్లలో ఉన్న సీసీ పుటేజ్‌లు, వాట్సాప్‌ గ్రూపులు, టీవీ చానల్స్‌లో ప్రసారమైన దృశ్యాలను ఆధారంగా చేసుకుని నిందితులను గుర్తించామన్నారు.

అలాగే 12 వాట్సాప్‌ గ్రూపులను గుర్తించామని పేర్కొన్నారు. ఈ వాట్సాప్‌ గ్రూపుల్లో ఆందోళనకారులు పరస్పర సమాచారం చేర వేసుకుంటూ.. ఫలానా చోటకు రావాలని, ఫలానా చోట పోలీసుల బందోబస్తు అధికంగా ఉందని.. అడ్డదారుల్లో రావాలని ఆ దారులు తెలియజేస్తూ గ్రూపుల్లో సమాచారం పంపించారని తెలిపారు. ఈ 12 వాట్సాప్‌ గ్రూపుల్లో ఆ రోజు సాగిన పోస్టింగ్‌లు, మెసేజ్‌లు సేకరించామని చెప్పారు. వాట్సాప్‌ గ్రూపుల అడ్మిన్‌లపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో పళ్లంరాజు   

ఉద్దేశపూర్వకంగానే ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు..
మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇళ్లపై ఆందోళనకారులు ఉద్దేశపూర్వకంగా దాడి చేసి నిప్పుపెట్టారని డీఐజీ పాలరాజు చెప్పారు. నిందితులపై హత్యాయత్నంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, పథకం ప్రకారం దాడులు, దొమ్మి తదితర కేసులు నమోదు చేశామన్నారు. పోలీసు బందోబస్తు పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ ఆందోళనకారులు దాడులకు తెగబడిన పరిస్థితులపై పోలీసుశాఖ పునః సమీక్షించుకుంటుందన్నారు.

నల్లవంతెన వద్ద పోలీసుల వజ్ర వాహనాన్ని ధ్వంసం చేయడంతోపాటు కలెక్టరేట్‌ వద్ద, ఎర్ర వంతెన వద్ద బస్సులను తగలబెట్టడం, తర్వాత వాట్సాప్‌ గ్రూపుల్లో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇళ్లకు నిప్పు పెట్టాలని పథక రచన చేసుకుని ఎర్రవంతెన వైపు నుంచి వెళ్లారన్నారు. ఈ కేసుల దర్యాప్తులో ఆరు పోలీసు బృందాలు ఉన్నాయని.. మరో ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించే పనిలో ఉన్నాయని చెప్పారు.

ఈ విధ్వంస ఘటనల్లో పాల్గొన్నవారి పేర్లను గ్రామాలవారీగా సేకరించి జాబితాలను తయారుచేస్తున్నామన్నారు. దాడుల్లో రౌడీషీటర్ల పాత్ర ఉందన్నారు. శుక్రవారం మరో కొంత మందిని అరెస్టు చేస్తామని చెప్పారు. అరెస్టులు కొన్ని రోజులపాటు కొనసాగుతాయన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అనుచరుడు, రౌడీషీటర్‌ గంధం పళ్లంరాజుతో నాగబాబు (గళ్ల చొక్కా వ్యక్తి), పళ్లంరాజు (తెల్ల చొక్కా వ్యక్తి) 

సోషల్‌ మీడియా పోస్టుల ద్వారానే కుట్ర అమలు
కుట్రదారులు అమలాపురంలో విధ్వంసానికి పక్కాగా పన్నాగం పన్నారని పోలీసులు గుర్తించారు. ప్రధానంగా అల్లర్లకు ఆజ్యం పోయడానికి సోషల్‌ మీడియాను వాడుకున్నారు. ఈ నెల 19 నుంచి వర్గ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులను తమ వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేసినట్టు గుర్తించారు. సోషల్‌ మీడియా వేదికగా పరస్పరం దూషణలకు పాల్పడ్డారు. విద్వేషాలు రేకెత్తించేలా వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టుకోవడాన్ని ట్రెండ్‌గా మార్చారు. దాంతో సహజంగానే కోనసీమలో ఇరువర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు, వాహనాల దహనాలు, పరస్పరం దూషణల పర్వం కొనసాగింది. వీటిని అవకాశంగా చేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు నేతలు రంగంలోకి దిగారు. ఈ నెల 24న ర్యాలీ సందర్భంగా విధ్వంసానికి పాల్పడేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ర్యాలీలో వేలాదిమంది పాల్గొన్నప్పటికీ విధ్వంసం కుట్రను ఎంపిక చేసిన కొంతమందికే ముందుగా చెప్పారు. ర్యాలీ రూట్‌మ్యాప్, ఎక్కడ దారి మళ్లించాలి, పోలీసులపై రాళ్లు రువ్వడం, మంత్రి విశ్వరూప్‌ రెండు ఇళ్లు, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిపై దాడులు.. ఇలా అన్నీ పక్కాగా సోషల్‌ మీడియా పోస్టుల ద్వారానే కథ నడిపించినట్టు పోలీసులు గుర్తించారు. 
పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో అన్యం సాయి 

వాటి ఆధారంగానే దర్యాప్తు ముమ్మరం..
సోషల్‌ మీడియా పోస్టుల ఆధారంగానే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విధ్వంసానికి కుట్ర పన్నిన సూత్రధారులు, అల్లర్లలో పాల్గొన్నవారి సోషల్‌ మీడియా పోస్టులను పోలీసులు  పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 46 మందితో పాటు అరెస్టు చేసిన 19 మందినీ వారి సోషల్‌ మీడియా పోస్టుల ఆధారంగా విచారిస్తున్నారు. ఆ పోస్టులు మొదటగా ఎక్కడ నుంచి వచ్చాయన్న అంశాన్ని ఆరా తీస్తున్నారు. వారి కాల్‌ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. 

ఇక సూత్రధారుల అరెస్టులే..
సేకరించిన కీలక ఆధారాలతో అమలాపురంలో విధ్వంస కాండ వెనుక అసలు కుట్రదారులు ఎవర్నది గుర్తించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడంతోపాటు ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారుల పాత్రను తగిన ఆధారాలతోసహా నిరూపించే దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విధ్వంసం వెనుక అసలు పాత్రధారులు, కుట్రదారులను ఒకట్రెండు రోజుల్లో అరెస్టు చేసే అవకాశాలున్నాయి. సంచలన విషయాలు వెల్లడించే రీతిలో అరెస్టులు ఉండొచ్చని విశ్వసనీయ సమాచారం.

ప్రశాంతంగా కోనసీమ..
అమలాపురంలో పోలీసుల చర్యలతో ప్రశాంత వాతావరణం ఏర్పడింది. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వ్యాపార దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తున్నాయి. ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో సర్వీసులు నడుపుతోంది. దాదాపు వెయ్యి మంది పోలీసులతో అత్యంత పకడ్బందీగా బందోబస్తు కొనసాగుతోంది.   

ప్రజాభీష్టం మేరకే అంబేడ్కర్‌ జిల్లా 
శ్రీకాకుళం రూరల్‌: ప్రజాభీష్టం మేరకే కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టామని హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. కోనసీమ ప్రస్తుతం ప్రశాంతంగానే ఉందని.. 2 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.  కోనసీమ అల్లర్ల వెనుక ఎవరున్నారో పోలీసులు కూపీ లాగుతున్నారని తెలిపారు.  
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు దండ వేస్తున్న అరిగల వెంకట రామారావు(ఎడమవైపు), మోకా సుబ్బారావు(కుడివైపు) 

పోలీసులు అరెస్ట్‌ చేసిన 19 మంది వీరే..
గురువారం పోలీసులు అరెస్టు చేసిన 19 మంది నిందితుల్లో 18 మంది జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందినవారే. టీడీపీ కార్యకర్తలు.. దున్నల తాతాజీ ధనుంజయ దిలీప్, అల్లబిల్లి సూర్యనారాయణమూర్తి, జనసేన పార్టీ కార్యకర్తలు.. అన్యం దుర్గా సాయికుమార్, కల్వకొలను సత్యనారాయణమూర్తి, కురసాల సురేష్‌ నాయుడు, నార్కెడిమిల్లి కృష్ణకిశోర్, అడ్డాల నాగ శ్రీరంగ గణేష్, చిట్టూరి ప్రసాద్, విత్తనాల శివనాగ మణికంఠ, ఎర్రంశెట్టి బాలాజీ, నల్లా సురేష్, విత్తనాల ప్రభాకర్, పలివెల శేఖర్, నేదునూరి వెంకటేష్, నడవపల్లి భవానీ శివశంకర్, కంచిపల్లి వెంకటేశ్వరరావు, బీజేపీ కార్యకర్తలు..సత్తిరెడ్డి సతీష్, ఎర్రంశెట్టి సాయిబాబులతోపాటు ఏ పార్టీకి చెందని వాసంశెట్టి రాము ఉన్నారు. వీరిలో 12 మంది అమలాపురం పట్టణానికి చెందినవారు కాగా అమలాపురం రూరల్‌ మండలానికి చెందినవారు ముగ్గురు, పి.గన్నవరానికి చెందినవారు ఇద్దరున్నారు. అల్లవరం, అయినవిల్లిలకు చెందినవారు చెరొకరు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement