సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. బాలుడి మృతికి కారణమైన బండిలో.. ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కూడా ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. రాహిల్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఏసీపీ సుదర్శన్ వివరాలను వెల్లడించారు.. ఫిలింనగర్ నుండి ఇన్ ఆర్బిట్ మాల్ మీదుగా తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారులో ఎంఎల్ఏ కొడుకు రాహిల్ ఉన్నాడు. రాహిల్ తో పాటు అఫ్నాన్, నాజ్ మొత్తం ముగ్గురు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పారిపోయారు. నిందితులు పారిపోయిన రూట్ లో సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించాం. అన్ని రకాల ఎవిడెన్స్ సేకరించాం. ప్రమాదం జరిగిన టైంలో కారు నడిపింది అఫ్నాన్. రాహిల్ పక్కనే ఉన్నాడు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కారు నడిపింది అఫ్నాన్ అని నిర్ధారించుకున్నాం. ప్రమాదానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ ప్రధాన కారణాలని ఏసీపీ వెల్లడించారు.
గురువారం రాత్రి దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు మహేంద్ర థార్ వేగంగా దూసుకొచ్చింది. ఆ టైంలో రోడ్డు దాటుతున్న కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మా బోస్లేలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కాజల్ చౌహాన్ రెండు నెలల బిడ్డ కిందపడి.. మృతి చెందిన విషయం తెలిసిందే. బండిపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అహ్మద్ పేరుతో స్టిక్కర్ ఉండడంతో కేసు ఆసక్తికరంగా మారింది. కాజల్ చౌహాన్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆపై పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కారు నడిపింది ఎమ్మెల్యే కొడుకేనంటూ ప్రచారం మొదలైంది. అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారి మృతి చెందడంతో.. విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ కారు తమ బంధువులదని, ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని, ఆ కారులో తన కొడుకు లేడని ఎమ్మెల్యే షకీల్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆ కారులో తమ బంధువులు మాత్రమే ఉన్నారని ఎమ్మెల్యే శుక్రవారం వివరణ ఇవ్వగా.. అందులో ఆయన కొడుకు కూడా ఉన్నాడంటూ తాజాగా పోలీసులు ప్రకటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment