
చిక్కమగళూరు: కర్ణాటకలోని చిక్కమగళూరులో ఓ వ్యక్తి తన ప్లాంటేషన్‌లో దళితులను నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన ఘటన సంచలనం రేపుతోంది. జగదీశగౌడకు జెనుగడ్డె గ్రామం వద్ద కాఫీ ప్లాంటేషన్ ఉంది. ఇతడి నుంచి రోజువారీ కూలీలైన బాధితులు రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ సొమ్మును తిరిగి చెల్లించలేకపోవడంతో మొత్తం 16 మందిని జగదీశ తన ప్లాంటేషన్‌లో నిర్బంధించాడు. జగదీశ గౌడ దెబ్బలతో ఒక మహిళకు గర్భస్రావం అయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులు జగదీశ గౌడ, అతడి కుమారుడు తిలక్ కోసం గాలింపు చేపట్టారు.
తమ బంధువులను జగదీశ గౌడ చిత్రహింసలు పెడుతున్నారంటూ కొందరు వ్యక్తులు ఈనెల 8వ తేదీన ఫిర్యాదు చేశారు. మరుసటి రోజే ఆ ఫిర్యాదును వారు వెనక్కి తీసుకున్నారని బలెహొన్నూర్ పోలీసులు చెప్పారు. ఆ మరునాడు బాధితురాలైన గర్భవతిని ఆస్పత్రిలో చేర్పించి, చిక్కమగళూరులో మరోసారి వీరు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో తాము వెళ్లి బందీలుగా ఉన్న నాలుగు కుటుంబాలకు చెందిన మొత్తం 16 మందిని విడిపించామన్నారు. వీరిని 15 రోజులుగా నిర్బంధంలోనే ఉంచినట్లు తేలిందన్నారు. వీరిలో రెండు నెలల గర్భవతి అయిన అర్పిత కూడా ఉంది. జగదీశ గౌడ ఈమె ఫోన్ లాగేసుకుని ఒక రోజు నిర్బంధించాడని, కొట్టడంతో గర్భస్రావం అయిందని ఆమె తల్లి ఆరోపించింది. జగదీశ గౌడ నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకున్న వారు ఎటో వెళ్లిపోవడంతో అతడు తమను నిర్బంధించినట్లు బాధితులు తెలిపారని చిక్కమగళూరు ఎస్‌పీ ఉమా ప్రశాంత్ చెప్పారు. కాగా, జగదీశ గౌడ బీజేపీ నేత అంటూ వచ్చిన వార్తలను బీజేపీ ఖండించింది. జగదీశ గౌడతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జిల్లా ప్రతినిధి వరసిద్ధి వేణుగోపాల్ తెలిపారు.
ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర‍్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment