కోల్‌కతా వైద్యురాలి హత్యాచారంపై సుప్రీంకోర్టు
ఆత్మహత్యగా చిత్రించారంటూ ప్రిన్సిపాల్‌పై ధ్వజం
అతనికి మరో పోస్టింగా, ఎఫ్‌ఐఆర్ అంత లేటా?..
మమత సర్కారును తూర్పారబట్టిన ధర్మాసనం
నిరసనకారులపై ప్రతాపం చూపొద్దని ఆదేశం.. హతురాలి పేరు, ఫొటోలు, వీడియోలపై ఆగ్రహం
కోల్‌కతా పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపాటు.. వ్యవస్థలో లోపాలు మరోసారి తెరపైకి: సీజేఐ
మహిళలు సురక్షితంగా పని ప్రదేశాలకు వెళ్లలేకపోవడమంటే వారికి సమానత్వ హక్కును కాలరాయడమే. మరో రేప్, హత్య జరిగేదాకా వేచి చూడలేం. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు దేశవ్యాప్త ప్రోటోకాల్ కావాల్సిందే. దాని విధివిధానాల రూపకల్పనకు వైస్ అడ్మిరల్ ఆర్తీ సరిన్ సారథ్యంలో టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. మాపై నమ్మకం ఉంచి విధుల్లో పాల్గొనాల్సిందిగాn దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వైద్య సిబ్బందిని కోరుతున్నాం. – సుప్రీంకోర్టు ధర్మాసనం
న్యూఢిల్లీ: కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని అత్యంత పాశవిక ఘటనగా సుప్రీంకోర్టు అభివరి్ణంచింది. ఈ ఉదంతంలో మమత సర్కారు ఆద్యంతం తీవ్ర బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందంటూ తీవ్రంగా తలంటింది. ఎఫ్‌ఐఆర్ దాఖలులో ఆలస్యం మొదలుకుని ఈ దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించజూసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌కు మరో పోస్టింగ్, ఆస్పత్రిపై మూక దాడిని నిలువరించడంలో వైఫల్యం దాకా ఒక్క అంశాన్నీ ఎత్తి చూపుతూ నలుగు పెట్టింది. దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది ఏమాత్రం రక్షణ లేని పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ విషయమై మన వ్యవస్థలోని దారుణ లోపాలను కోల్‌కతా ఉదంతం మరోసారి తెరపైకి తెచి్చందని అభిప్రాయపడింది. మహిళలు సురక్షితంగా పని ప్రదేశాలకు వెళ్లలేకపోవడమంటే వారి సమానత్వపు హక్కును కాలరాయడమేనని స్పష్టం చేసింది. ‘‘మరో రేప్, హత్య జరిగేదాకా వేచి చూడలేం. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు దేశవ్యాప్త ప్రొటోకాల్ కావాల్సిందే’’ అని స్పష్టం చేసింది. దాని విధివిధానాల రూపకల్పనకు వైస్ అడ్మిరల్ ఆర్తీ సరిన్ సారథ్యంలో వైద్య ప్రముఖులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు వారాల్లోగా ప్రాథమిక నివేదిక, రెండు నెలల్లో పూర్తి నివేదిక అందించాల్సిందిగా టాస్‌్కఫోర్స్‌కు సూచించింది. హత్యాచార ఘటనపై ఏమేం చర్యలు తీసుకున్నారో నివేదించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని, దర్యాప్తు పురోగతిపై గురువారానికల్లా నివేదిక ఇవ్వాల్సిందిగా సీబీఐని ఆదేశించింది.
హత్యాచారానికి, మూక దాడికి వేదికైన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ వైద్య కాలేజీ, ఆస్పత్రికి సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత కలి్పంచాలని ఆదేశించింది. తమపై నమ్మకముంచి విధుల్లో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న వైద్య సిబ్బందిని కోరింది. టాస్క్‌ఫోర్స్ నియామకాన్ని వైద్య సంఘాలు స్వాగతించినా విధుల బహిష్కరణను కొనసాగిస్తామని ప్రకటించాయి.
చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ఆగస్టు 9న ట్రైనీ వైద్యురాలు దారుణ అత్యాచారానికి, హత్యకు గురవడం, దాన్ని నిరసిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగడం, ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించడం తెలిసిందే. జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్డీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం దీనిపై మంగళవారం విచారణ జరిపింది. ఈ ఉదంతంలో బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందంటూ విమర్శించింది.
‘‘ఎఫ్‌ఐఆర్ దాఖలుకు ఎందుకంత ఆలస్యమైంది? ఇంతటి దారుణం జరిగినా ఆస్పత్రిలో భద్రతను కట్టుదిట్టం చేయలేదెందుకు? వేలాదిగా అల్లరి మూకలు ఆస్పత్రిపై దాడికి దిగి నేరానికి సంబంధించిన కీలకమైన ఆధారాలన్నింటినీ చెరిపేస్తుంటే కోల్‌కతా పోలీసులు చేష్టలుడిగారేం? క్రైం సీన్‌కు వేదికైన ఆస్పత్రికి పక్కాగా కాపలా ఉండాల్సింది పోయి దాడి మొదలవగానే పారిపోవడమా! రాష్ట్ర ప్రభుత్వ తీరు విస్తుగొలుపుతోంది’’ అంటూ సీజేఐ దుయ్యబట్టారు.
శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వైద్య సిబ్బందిపై బలప్రయోగానికి దిగకుండా సున్నితంగా వ్యవహరించాలని ఆదేశించారు. హతురాలి పేరు, మృతదేహం ఫొటోలు, వీడియోలు బయటికి రావడంపై ఆందోళన వెలిబుచ్చారు. అన్నిరకాల మీడియా నుంచీ వాటిని తక్షణం తొలగించాల్సిందిగా ఆదేశించారు.
వైఫల్యం లేదు: సిబల్
వైద్యురాలిపై జరిగిన దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించేందుకు వైద్య కాలేజీ, ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ప్రయతి్నంచారంటూ ధర్మాసనం మండిపడింది. ‘‘తల్లిదండ్రులను చాలాసేపటిదాకా మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించలేదు. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. ఇలాంటి వ్యక్తికి మరో వైద్య కాలేజీలో పోస్టింగ్ ఎలా ఇస్తారు?’’ అని మమత సర్కారును ప్రశ్నించింది.
ఇందులో ప్రభుత్వ వైఫల్యమేమీ లేదని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదించారు. కోల్‌కతా పోలీసులు సత్వరం స్పందించి అవసరమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు. పోలీసులు నేర స్థలానికి చేరుకోకముందే హతురాలి ఫొటోలు, వీడియోలు బయటికొచ్చాయన్నారు. ఈ వాదనతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విభేదించారు. పోలీసులకు సమాచారం లేకుండా వేలాది మంది ఆస్పత్రిపైకి వచి్చపడటం అసాధ్యమన్నారు.
టాస్క్‌ఫోర్స్ బృందం ఇదే...
వైద్యుల భద్రత తదితరాలపై సిఫార్సుల కోసం సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్‌ఫోర్స్ సభ్యులు...చైర్‌పర్సన్: వైస్ అడ్మిరల్ ఆర్తీ సరిన్ (మెడికల్ సర్వీసెస్ డీజీ) సభ్యులు: డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి (ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ ఎండీ), డాక్టర్ ఎం.శ్రీనివాస్ (ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్), డాక్టర్ ప్రతిమా మూర్తి (ఎన్‌ఐఎంహెచ్‌ఈ డైరెక్టర్), డాక్టర్ గోవర్ధన్ దత్ పురీ (జోధ్‌పూర్ ఎయిమ్స్ ఈడీ), డాక్టర్ సౌమిత్రా రావత్ (ఐఎస్‌జీ చైర్‌పర్సన్), అనితా సక్సేనా (బీడీ శర్మ మెడికల్ వర్సిటీ వీసీ), పల్లవీ సప్లే (జేజే గ్రూప్ ఆస్పత్రుల డీన్), డాక్టర్ పద్మా శ్రీవాత్సవ (ఢిల్లీ ఎయిమ్స్ మాజీ ప్రొఫెసర్) వీరితో పాటు టాస్క్‌ఫోర్స్‌లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కేంద్ర కేబినెట్ కార్యదర్శితో పాటు హోం, ఆరోగ్య శాఖల కార్యదర్శులు తదితరులు వ్యవహరిస్తారు
ఏమిటీ అరుణా షాన్‌బాగ్ కేసు?
కోల్‌కతా వైద్యురాలి కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ప్రస్తావించిన అరుణా షాన్‌బాగ్ ఉదంతం 1973 నాటిది. ఆమె మహారాష్ట్రలోని కింగ్ ఎడ్వర్డ్ ఆస్పత్రిలో నర్సుగా చేసేది. వైద్య ప్రయోగాలకు వాడే కుక్కల ఆహారాన్ని వార్డు బాయ్ కాజేస్తుండటంతో పై అధికారులకు చెబుతానని బెదిరించింది. ఆ కక్షతో ఆమెపై పాశవికంగా లైంగిక దాడికి పాల్పడటమే గాక కుక్కల గొలుసుతో కట్టేశాడు. మెదడుకు గాయమై అరుణ కోమాలోకి వెళ్లింది. అప్పటికామెకు పాతికేళ్లు. అరుణకు కారుణ్య మరణం ప్రసాదించాలన్న విజ్ఞప్తులను సుప్రీంకోర్టు తోసిపుచి్చంది. దాంతో 40 ఏళ్లపాటు మంచానికే పరిమితమై 2015లో కన్నుమూసింది. నిందితునిపై లైంగిక అభియోగాలు మోపకపోవడంతో కేవలం ఏడేళ్ల శిక్ష అనుభవించి 1980లో బయటికొచ్చాడు.
బాత్రూములకూ దిక్కులేదు!
అందరికీ ఆరోగ్యం అందించే వైద్య సిబ్బందికే పని ప్రదేశాల్లో ఏ మాత్రం భద్రత లేని దుస్థితి దేశవ్యాప్తంగా నెలకొని ఉందని సుప్రీంధర్మాసనం ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి రక్షణ కల్పించడంలో పూర్తిస్థాయి వైఫల్యముంది. వారికి డ్యూటీ రూముల్లేవు. మహిళా, పురుష వైద్యులకు, నర్సులకు విడిగా బాత్రూముల్లేవు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎవరు పడితే వారు ఏ విభాగంలోకైనా నిరి్నరోధంగా ప్రవేశిస్తున్నారు. దాంతో విధి నిర్వహణలోని వైద్యులు, వైద్య సిబ్బంది పలు రూపాల్లో హింసకు లక్ష్యంగా మారుతున్నారు.
రోగులకు జరగరానిది జరిగితే వైద్యపరమైన నిర్లక్ష్యమే కారణమంటూ సంబం«దీకులు వైద్య సిబ్బందిపై హింసకు దిగుతున్నారు. పురుషాధిక్య భావజాలం కారణంగా మహిళా వైద్యులు, సిబ్బంది లైంగిక, లైంగికేతర హింసకు ఎక్కువగా బలవుతున్నారు. సహోద్యోగులు, సీనియర్లు, బాసుల నుంచి కూడా లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. అరుణా షాన్‌బాగ్ వంటి ఉదంతాలే ఇందుకు నిదర్శనం. వైద్య డిగ్రీలను, కెరీర్‌లో ఎదుగుదలను ప్రభావితం చేయగల అధికారం ఈ బాసుల చేతుల్లోనే ఉంటోంది.
ఇలాంటి హింసను నిరోధించే సమర్థమైన భద్రతా ఏర్పాట్లు ఆస్పత్రులు, వైద్య సంస్థల్లో లేకపోవడం ఆందోళనకరం. డాక్టర్లకు భద్రత కలి్పంచడం జాతి ప్రయోజనాలకు సంబంధించిన అంశం. పలు రంగాల్లో మహిళల ప్రవేశం నానాటికీ పెరుగుతున్నందున పని ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరముంది’’ అని ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment