ఆత్మహత్యకు ముందు వీడియో తీసి.. | Love Couple Deceased In Guntur District | Sakshi
Sakshi News home page

మూగ ప్రేమజంట బలవన్మరణం

Published Fri, Sep 11 2020 10:28 AM | Last Updated on Fri, Sep 11 2020 10:29 AM

Love Couple Deceased In Guntur District - Sakshi

అశ్విని (ఫైల్‌), షేక్‌ మస్తాన్‌ వలీ (ఫైల్‌)

హాలియా (గుంటూరు జిల్లా): ఆ ఇద్దరూ మూగవారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతనితో యువతి ప్రేమలో పడింది. అయితే.. యువకుడికి ఇప్పటికే పెళ్లయ్యింది. ఇద్దరి మతాలు వేరుకావడం, యువకుడికి అప్పటికే పెళ్లికావడం.. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో కలిసి జీవించలేమని భావించి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా శ్రీనివాసరావుపేట గ్రామానికి చెందిన షేక్‌ మస్తాన్‌ వలీ (27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. అతనికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. (చదవండి: అయ్యో.. ఎంత ఘోరం!

హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న నిజామాబాద్‌ జిల్లా ఎడవెల్లి మండలం జక్కంపేట గ్రామానికి చెందిన నందిపాటి అశ్విని (20) కూడా అతనితో పాటే అదే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ చెవిటి, మూగవారు. ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన అశ్విని కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. ఇద్దరి మతాలు వేరుకావడంతో పాటు ఇదివరకే మస్తాన్‌వలీకి పెళ్లయి భార్య కూడా ఉండడంతో ఇరు కుటుంబాలూ వారి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి షేక్‌ మస్తాన్‌ వలీ, అశ్విని ద్విచక్ర వాహనంపై నాగార్జునసాగర్‌కి వచ్చారు. ఈనెల ఏడో తేదీన ఇంటినుంచి బయటకు వెళ్లిన అశ్విని తిరిగి రాలేదని ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: కాలువలో 8 కిలోమీటర్లు కొట్టుకుపోయి..)

నాగార్జునసాగర్‌లో బుధవారం రాత్రి వరకు ఉన్న ప్రేమజంట ఆ తర్వాత అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై అనుముల మండలంలోని పాలెం స్టేజీ సమీపంలో ఉన్న రైతు కర్ణం శేషయ్య పొలం వద్దకు వచ్చారు. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నారు. అయితే అంతకుముందు నాగార్జునసాగర్‌లో ఉన్నప్పుడే తాము చనిపోతున్నట్టు (సైగల ద్వారా) వారు సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపారు. దీంతో మస్తాన్‌వలీ, అశ్విని ఆచూకీ కోసం వారి స్నేహితులు సాగర్‌కి వచ్చారు. గూగుల్‌ లొకేషన్‌ ద్వారా ఆరా తీసుకుంటూ గురువారం ఉదయం అనుముల మండలంలోని పాలెం స్టేజీ వద్దకు చేరుకున్నారు. అక్కడ వ్యవసాయ పొలంలో విగతజీవులుగా పడివున్న ప్రేమజంటను చూసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ మృతుల ఆధార్, ఐడీ కార్డులు లభించడంతో వాటి ఆధారంగా షేక్‌ మస్తాన్‌వలీ, అశ్వినిగా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నాగార్జునసాగర్‌ కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement