విషాదం : మరణంతో ఒకటవుదాం.. | Lovers Committed Suicide In Warangal And Narayanpet | Sakshi
Sakshi News home page

బావిలో దూకి ఓ జంట.. పురుగు మందు తాగి మరో జంట

Published Sat, Dec 19 2020 2:19 AM | Last Updated on Sat, Dec 19 2020 2:19 AM

Lovers Committed Suicide In Warangal And Narayanpet - Sakshi

సాయికుమార్- అశ్విని (ఫైల్‌)

ప్రేమ సాక్షిగా ఒక్కటవ్వాలని బాస చేసుకున్నారు.. చేతిలో చెయ్యేసి జీవితాంతం సంతసించాలని కలలు కన్నారు.. కానీ ప్రేమించిన వారిని కాదని పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేశారు..  ప్రేమించిన వాడికి దూరం కావడం తట్టుకోలేకపోయారు.. దీంతో ఇష్టమైన వాడితో కలసి జీవించలేకపోయారు.. కనీసం తనతో కలసి తనువైనా చాలించాలని నిర్ణయించుకున్నారు.. తమ ప్రేమను బతికించుకునేందుకు బలవన్మరణానికి సిద్ధపడ్డారు.

మామునూరు/దేవరకద్ర/ఖమ్మంక్రైం: వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మన్నె సాయికుమార్‌(23) ఢిల్లీలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతున్నాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బసవపురం గ్రామానికి చెందిన తాటిపాముల అశ్విని(21) కూడా అదే కాలేజీలో చేరింది. అక్కడ వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అశ్విని తల్లిదండ్రులు అంగీకరించలేదు. అంతేకాదు 5 నెలల కింద అశ్వినికి ఓ యువకుడితో పెళ్లి చేశారు. పెళ్లయినా కూడా తాను ప్రేమించిన సాయికుమార్‌ను అశ్విని మరిచిపోలేకపోయింది. తరచూ అతడితో ఫోన్‌లో మాట్లాడుతూ ఆవేదన చెందేది.

అయితే గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సాయికుమార్‌ను కలిసేందుకు సిద్దిపేట నుంచి వరంగల్‌ చేరుకుంది. ఆ తర్వాత సాయికుమార్‌ తన స్నేహితుడి బైక్‌ తీసుకుని నక్కలపల్లి గ్రామానికి దూరంగా వెళ్లారు. గురువారం రాత్రి వరకు అక్కడే ఉండి, శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలోని ఐన కృష్ణస్వామికి చెందిన వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇరువురూ విడిపోకుండా చున్నీని ఇద్దరూ తమ చేతులకు కట్టుకున్నారు. శుక్రవారం ఉదయం కృష్టస్వామి బావి వద్దకు వెళ్లగా ఒడ్డున మంగళసూత్రం, రెండు ఫోన్లు, చెప్పులు, బైక్‌ ఉండటంతో మామునూరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా, బావిలో మృతదేహాలు కనిపించాయి. ఆ తర్వాత అశ్విని, సాయికుమార్‌ మృతదేహాలను బయటికి తీయించారు.

మరో జంట ఆత్మహత్యాయత్నం..
ఖమ్మం పట్టణంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రఘునాథపాలెం మండలం చిమ్మపూడికి చెందిన వెంకటేశ్వర్లు, అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియటంతో సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి ఆమెకు పెళ్లి చేశారు. అయినా ఆ యువతి వెంకటేశ్వర్లును మర్చిపోలేకపోయింది. ఈ క్రమంలో వారం కిందట వెంకటేశ్వర్లు ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో యువతి భర్త మునగాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. అప్పటినుంచి వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే శుక్రవారం ఆ జంట.. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఖమ్మం మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అక్కడ ఉన్న సీఐ కాసేపటి తర్వాత మాట్లాడుదామని చెప్పారు. అంతలోనే వారు తమతో పాటు తెచ్చుకున్న మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పగా, వారిద్దరినీ వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.


పురుగుల మందు తాగి..
తమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని లంకాలకు చెందిన ఉప్పరి శేఖర్‌ (23), బోయ అనూష (14) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 16 ఉదయం ఇంటి నుంచి ఇద్దరూ వెళ్లిపోయి.. చిన్నచింతకుంట మండలం ఉంద్యాల శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం అటువైపు వెళ్లిన కొందరు వీరి మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిద్దరూ పురుగుల మందు తాగి చనిపోయినట్లు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement