ఇందూరులో ‘తీవ్ర’ కలకలం  | Man Arrested With Links To Terrorists In Nizamabad | Sakshi
Sakshi News home page

ఇందూరులో ‘తీవ్ర’ కలకలం 

Published Wed, Jul 7 2021 12:49 AM | Last Updated on Wed, Jul 7 2021 7:53 AM

Man Arrested With Links To Terrorists In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ అర్బన్‌: ‘ఉగ్ర కార్యకలాపాల’ వార్తతో ఇందూరు జిల్లా మరోమారు ఉలిక్కిపడింది. బోధన్‌ యువకుడి అరెస్టుతో ఒక్కసారిగా కలకలం రేగింది. జిల్లాలో గతంలోనూ ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. కరుడుగట్టిన ఉగ్రవాదులు ఇక్కడ తలదాచుకున్న ఘటనలూ వెలుగు చూశాయి. ఉగ్రవాదులతో పాటు స్లీపర్‌సెల్స్‌ జిల్లాలో ఆశ్రయం పొందినట్లు, హైదరాబాద్‌ బాంబు పేలుళ్లకు పాల్పడిన వారిలో కొందరికి ఇక్కడి నుంచి సహకారం లభించినట్లు గతంలో బయటపడింది. ఇక, విదేశీయులకు అక్రమంగా పాస్‌పోర్టుల మంజూరు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందనే అనేమానంతో బోధన్‌లోని రెంజల్‌ బేస్‌కు చెందిన ఓ యువకుడ్ని కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అదుపులోకి తీసుకున్న వార్త వెలుగులోకి రావడం కలవరపాటుకు గురిచేసింది. 

అనుమానితులకు అడ్డాగా..! 
జిల్లాలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు గతంలోనే వెలుగు చూసింది. సమస్యాత్మక ప్రాంతాలను అడ్డాగా చేసుకుని స్లీపర్‌సెల్స్‌ పని చేస్తున్నట్లు నిఘా వర్గాలు అప్పట్లోనే గుర్తించాయి. కరుడు గట్టిన ఉగ్రవాది ఆజాం ఘోరిని జిల్లా పోలీసులు కాల్చి చంపారు. స్వచ్ఛంద సంస్థల పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు విస్తరిస్తున్నారనే నెపంతో కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. బోధన్‌లోని మూడు ప్రాంతాలతో పాటు ఎడపల్లిలోని ఓ ప్రాంతంలో ‘అనుమానితులు’ ఎక్కువగా ఉంటారని పోలీసులే అంతర్గతంగా చెబుతారు. అలాంటి వారి విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకుండా పోలీసులకు అనేక ‘అడ్డంకులు’ ఎదురవుతున్నట్లు తెలిసింది. ఇదే నెపంతో కొన్నాళ్లుగా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు పెద్దగా దృష్టి పెట్టట్లేదని సమాచారం. కీలకమైన కొన్ని ప్రాంతాల్లో నిఘా వైఫల్యం తరచూ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారనే విషయాలు పోలీసులకు తెలియడం లేదు. పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్‌ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

నిఘా వైఫల్యం.. 
విదేశీయులకు అక్రమంగా పాస్‌పోర్టుల జారీ వ్యవహారమే జిల్లాలో నిఘా వైఫల్యానికి అతిపెద్ద నిదర్శనంగా నిలిచింది. ప్రధానంగా బోధన్‌తో పాటు మరికొన్ని వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా నిద్ర పోతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా 72 మంది రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇచ్చేందుకు ఎస్‌బీ పోలీసులే క్లీన్‌చిట్‌ ఇవ్వడం వారి వైఫల్యానికి, నిర్లక్ష్యానికి పెద్ద ఉదాహరణ. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు విదేశీయులు బోధన్‌ అడ్రస్‌ పేరుతో పాస్‌పోర్టులు పొంది బంగ్లాదేశ్‌కు వెళ్లి పోయారు. ఇదే తరహాలో ఇద్దరు విదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తూ హైదరాబాద్‌ విమానాశ్రయంలో దొరికి పోవడంతో ఈ తతంగం బయటపడింది. తాజాగా బోధన్‌కు చెందిన యువకుడు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడనే అనుమానంతో హైదరాబాద్‌ నుంచి వచ్చిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అదుపులోకి తీసుకోవడం కలవరానికి గురి చేసింది. ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక అధికారులు వచ్చి తమ ‘పని’ చక్కబెడుతుంటే, ఇక్కడే ఉండే నిఘా వర్గాలు మాత్రం అనుమానాస్పద కార్యకలాపాలను మాత్రం గుర్తించలేక పోతున్నాయి. ఇప్పటికైనా నిఘా వర్గాలు మేల్కొనపోతే కష్టమేననే భావన వ్యక్తమవుతోంది.  

అసాంఘిక శక్తులకు అడ్డాగా.. 
కరుడు గట్టిన ఉగ్రవాది ఆజాం ఘోరీ నిజామాబాద్‌లో తలదాచుకుంటూ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించాడు. ఇదే పని మీద జగిత్యాలకు వెళ్తుండగా, ఏప్రిల్‌ 6, 2000 సంవత్సరంలో నిజామాబాద్, కరీంనగర్‌ పోలీసులు కలిసి మట్టుబెట్టారు. 
సారంగపూర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఓ ఉగ్రవాదిని పోలీసులు కాల్చి చంపారు. 2002లో సారంగపూర్‌లోని ఎస్టీడీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్‌ హతమయ్యాడు. 
బోధన్‌లోని ఓ సైకిల్‌ షాప్‌ యజమానిని 1998లో ఆజాం ఘోరి, అతని అనుచరులు తొమ్మిది మంది కలిసి హత్య చేశారు. ఈ కేసులో ఏడుగురు అరెస్టు కాగా, మరో ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఈ ఇద్దరు హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బాంబుపేలుళ్లలో నిందితులకు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది.  
నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులనే అనుమానంతో ముగ్గురిని నిజామాబాద్‌ కలెక్టరేట్‌ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు.  
ఇది జరిగిన కొన్నాళ్లకే నిజామాబాద్‌ రూరల్‌ మండలం గుండారంలో దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్లు ప్రత్యక్షమయ్యాయి. గాంధీజీ విగ్రహానికి నల్ల రంగు పూసిన దుండగులు.. కలెక్టరేట్‌ వద్ద అరెస్టు చేసిన వారిలో ఒకరిని విడుదల చేయాలంటూ పేపర్లలో రాయడం కలకలం రేపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement