వివరాలు వెల్లడిస్తున్న సీఐ పైడయ్య
ఆమదాలవలస(శ్రీకాకుళం జిల్లా): ఆమదాలవలస పట్టణంలోని ఎల్.అప్పారావు వీధిలో ఇటీవల జరిగిన పాతిన అనూరాధ హత్యకేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ పైడయ్య సోమవారం తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. పొందూరు మండలం గోకర్నపల్లి గ్రామానికి చెందిన సీపాన మహేష్ అనే వ్యక్తి ఈ హత్య చేసి నట్లు సీఐ వెల్లడించారు. హత్య జరిగిన రోజు మహేష్ రాత్రి 10 గంటల నుంచి 10.45 వరకు అనూరాధ ఇంటిలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఈ దుర్ఘటన జరిగిందని వివరించారు. నిందితుడి చేతికైన గాయమే అతడిని పట్టించింది.
చదవండి: భర్తకు దూరం.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం.. చివరికి..
సీఐ తెలిపిన వివరాల మేరకు.. గోకర్నపల్లికి చెందిన మహేష్ హత్య జరిగిన రోజు రాత్రి అనూరాధను కలిసేందుకు రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. డబ్బుల విషయమై ఇద్దరి మధ్య వా దన జరిగింది. ఫోన్ పేలో బదిలీ చేశానని మహేష్ చెప్పగా.. ఆమె రుజువు చూపించమని అడిగే సరికి పాత లావాదేవీల రశీదును ఫోన్‌లో చూపించాడు. దీన్ని పసిగట్టిన అనూరాధ అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ ఘర్షణలో తొలుత మహేష్ కత్తెరతో అనూరాధ మెడపై దాడి చేశాడు. ఆమె అరవడంతో ఇరుగు పొరుగు వారు తలుపులు కొట్టారు. దీంతో మహేష్ ఆమె నోటిని గట్టిగా నొక్కి పట్టాడు. కాసేపటి తర్వాత విడిచి పెట్టేసరికి ఆమె కొన ఊపిరితో కనిపించింది. ఆమె బతికితే తనకు ఇబ్బంది తప్పదని కత్తెరతో 24 పోట్లు పొడిచి చంపేశాడు. హత్య చేశాక తన దుస్తులకు రక్తం అంటుకోవడంతో ఆ ఇంటిలోనే స్నానం చేసి మృతురాలి మొబైల్‌ను లెట్రిన్‌లో పడేశాడు. మరో కీ ప్యాడ్ ఫోన్‌లో బ్యాటరీ తీసి విసిరేసినట్టు పోలీసులు తెలిపారు.
గాయం కోసం చికిత్సకు వెళ్తే..
హత్య చేసే క్రమంలో మహేష్ చేతికి కూడా గాయమైంది. దీంతో అతను సొంతూరికి వెళ్లకుండా సంతకవిటిలోని ఓ ఆస్పత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న వీఆర్‌ఓ మహేష్‌ను గమనించగా.. అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో వీఆర్‌ఓ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకుని, ఎలా జరిగిందో వివరించాడు. అంతకుముందు పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేశారు. హత్య జరిగిన సమయంలో ఆమె ఫోన్‌కు పలువురి నుంచి కాల్స్ వచ్చినట్లు గమనించారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తుండగా నిందితుడు గాయంతో పట్టుబడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ కృష్ణారావు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment