ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నిర్మల్: ఆ ముగ్గురు ఉపాధి కోసం పల్లెల నుంచి జిల్లా కేంద్రం వచ్చారు. తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ఆ ముగ్గురి జీవితాల్లో ప్రేమచిచ్చు పెట్టింది. ఒకే రంగంలో ఉన్న యువతికి ఇద్దరు యువకులతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ అమ్మాయి ప్రేమ తనకే దక్కాలన్న అక్కసుతో ఓ యువకుడు మరో యువకుడి ప్రాణం తీశాడు. జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి వివరాలు వెల్లడించారు. లోకేశ్వరం మండలం గడ్‌చంద గ్రామానికి చెందిన మంద ప్రసాద్(24) నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంపౌండర్‌గా పనిచేస్తున్నాడు.
దిలావర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు స్థానిక ఓ కంటి ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న యువతికి, ఆ యువకుడికి మధ్య కొంతకాలంగా ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఇదే క్రమంలో ఆ యువతికి ప్రసాద్‌తో కూడా పరిచయమైంది. వీరి పరిచయం కూడా ప్రేమగా మారింది. ముందుగా పరిచయం అయిన యువకుడి తీరు నచ్చక సదరు యువతి ఇటీవల దూరం పెడుతూ వస్తోంది. తమ మధ్యలో ప్రసాద్ రావడంతోనే తనను దూరం పెడుతోందని భావించిన యువకుడు ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పతకం ప్రకారం ఐదు రోజుల క్రితం కత్తిని కొనుగోలు చేసి పెట్టుకున్నాడు.
చదవండి: వైరల్: ‘పుష్ప’ స్టైల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్.. చివర్లో షాకిచ్చిన పోలీసులు
సదరు యువతి అద్దెకు ఉంటున్న ప్రియదర్శినినగర్‌లోని రూమ్‌కి మంగళవారం రాత్రి పదిగంటల సమయంలో వెళ్లాడు. అక్కడ ఆమె లేకపోవడంతో మాట్లాడేది ఉందంటూ ఫోన్ చేసి పిలిపించాడు. అనుమానంతో ప్రసాద్ కూడా యువతి ఉంటున్న గదికి వెళ్లాడు. దీంతో అప్పటికే అక్కడ ఉన్న సదరు యువకుడికి, ప్రసాద్‌కు మధ్య తోపులాట జరిగింది. ఇదే క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తి ఆ యువకుడు ప్రసాద్ గుండె భాగంలో పొడిచి పారిపోయాడు. ఒక్కసారిగా ప్రసాద్ కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న మిత్రులు వచ్చేసరికి రక్తపు మడుగులో కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు.
చదవండి: వివాహేతర సంబంధం: 16 ఏళ్ల క్రితం పెళ్లి, భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి..
సదరు యువతి, మిత్రులు కలిసి స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాసేపటికే పరిస్థితి విషమించడంతో ప్రసాద్ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలించగా జిల్లా కేంద్రంలోని సోఫీనగర్‌లో పట్టుబడ్డాడు. శాంతిభద్రతల దృష్ట్యా నిందితుడి పేరు వెల్లడించడం లేదని, ప్రజలు ఎలాంటి పుకార్లు నమ్మకుండా పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. సమావేశంలో పట్టణ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment