రోదిస్తున్న వరలక్ష్మి పెంపుడు తల్లులు పోశవ్వ, రాజవ్వ
వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇద్దరికీ సంతానం లేరు. తమకు జీవితాంతం తోడుగా ఉంటుందని పదిరోజుల పసిగుడ్డును దత్తత తెచ్చుకున్నారు. పెంచి పెద్దచేశారు. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెరిగింది. ఇంటర్ వరకు చదివించారు. ఎదిగిన కూతురుకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ.. ప్రేమికుడి చేతిలో హతమవడంతో తమకు దిక్కెవరని ఇద్దరు తల్లులు గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
సాక్షి, కరీంనగర్: పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన ఆరెల్లి పోశవ్వ, బోయిని రాజవ్వ అక్కాచెల్లెళ్లు. పది రోజుల వయసప్పుడే వరలక్ష్మి(19)ని దత్తత తీసుకొని ఇంటర్ వరకు చదివించారు. ఈనేపథ్యంలో అదే మండలం పొరండ్లకు చెందిన ట్రాక్టర్ మెకానిక్ అఖిల్, వరలక్ష్మి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు అభ్యంతరం తెలిపినా వీరి తీరు మారలేదు. ఈనెల 2న ఇంటి నుంచి వెళ్లిన కూతురు కోసం 5వ తేదీన ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో మానకొండూర్ మండలం చెంజర్ల దేవునిగుట్ట వద్ద వరలక్ష్మిని అఖిల్ హత్య చేశాడని తెలియడంతో తల్లులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహం కుళ్లి, ఎడమ చేయి, తల భాగాలను జంతువులు పీక్కుతినడం చూసి గుండెలు బాదుకున్నారు. అడిషనల్ డీసీపీ (ఎల్ అండ్‌వో) శ్రీనివాస్, తిమ్మాపూర్, మానకొండూర్ సీఐలు శశిధర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, ఎస్సై ప్రమోద్‌రెడ్డిలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి ఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.
చదవండి: కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
అఖిల్ తల్లీ నిందితురాలే..!
►ఈ నెల2న హత్య జరిగిన అనంతరం అఖిల్ నేరుగా వైన్‌షాపునకు వెళ్లాడు.
►వరలక్ష్మిని చంపిన తరువాత అతడిలో భయం మొదలైంది.
►ఆ భయాన్ని మర్చిపోవాలని వైన్‌షాపు వద్ద ఫుల్ బాటిల్ కొని ఒక్కడే తాగాడు. అయినా, అతడిలో భయం పోలేదు.
►వెంటనే తల్లికి జరిగిందంతా చెప్పేశాడు. దీంతో కుటుంబ సభ్యులు అఖిల్‌పై చేయిచేసుకున్నారు.
►ఆపై అఖిల్ కూడా వింతవింతగా ప్రవర్తించసాగాడు.
►బయటికి వచ్చి కంటికి కనిపించిన ప్లెక్సీలు చించడం, తోరణాలు తెంపేయడం, చేతికి దొరికిన వస్తువులు విసిరికొట్టడం చేశాడు.
►కుటుంబ సభ్యులు ఎంత వారించినా వినలేదు. దీంతో కొందరు ఇరుగుపొరుగువారు డయల్ 100కు సమాచారం ఇచ్చారు.
►వెంటనే తిమ్మాపూర్‌కు చెందిన ఇద్దరు బ్లూకోల్ట్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
►ఇంతలో కుటుంబ సభ్యులు వారికి సర్దిచెప్పి పంపారే తప్ప.. హత్య విషయం వారికి చెప్పలేదు.
►ఈ విషయంలో నిజాన్ని దాచినందుకు పోలీసులు ఆమెను కూడా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.
పోలీసుల ముందే నిలదీసి ఉంటే..?
ఈ గొడవ జరుగుతుండగానే.. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వరలక్ష్మి అమ్మమ్మ అఖిల్ ఇంటికి చేరుకుంది. ఆమె అక్కడ పోలీసులను చూసింది. కానీ, నేరుగా అఖిల్ తల్లి వద్దకు వెళ్లి వరలక్ష్మి ఏది? అని నిలదీసింది. ‘తన కొడుకు అసలు ఉదయం నుంచి గడప దాటలేదు నీ మనవరాలు ఎక్కడుందో వెదుక్కో పో’ అని అఖిల్ తల్లి ఆమెను కసిరింది. ఆ మాటలు నమ్మిన వరలక్ష్మి అమ్మమ్మ తిరిగి ఇంటిముఖం పట్టింది. అక్కడే ఉన్న పోలీసులకు విషయం చెప్పి ఉంటే.. హత్య విషయం అదే రోజు వెలుగుచూసి ఉండేది.
రెండ్రోజుల తర్వాత మృతదేహం వద్దకు..
రెండురోజులు గడిచినా అఖిల్‌లో భయం పోలేదు. వరలక్ష్మి బతికే ఉందా? చనిపోయిందా? అన్న విషయం నిర్ధారించుకునేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం మరోసారి చెంజర్ల గుట్ట వద్దకు వెళ్లి చూస్తే అక్కడే వరలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో ఊరి వదిలి పారిపోతే అనుమానం వస్తుందని, ఫోన్‌కాల్స్ పోలీసులు తీస్తే తాను దొరికిపోతానని అక్కడే తన సెల్‌ఫోన్ పగులగొట్టాడు. తర్వాత తల్లి సెల్‌ఫోన్ వాడుతున్నాడు. పోలీసులను కూడా పక్కదారి పటిద్దామనుకున్నా.. వరలక్ష్మికి అఖిల్ చేసిన సీడీఆర్ (కాల్ రికార్డ్స్ డేటా) ముందుంచి ప్రశ్నించడంతో అఖిల్ నోరువిప్పక తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment