వివరాలు వెల్లడిస్తున్న సీఐ నాగశేఖర్
గుంతకల్లుటౌన్: కట్టుకున్నవాడే కాలయముడిగా మారాడు. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన నవవధువు జీవితాన్ని ఐదునెలలకే చిదిమేశాడు. గుంతకల్లు పట్టణంలో ఈ నెల 2న సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒన్‌టౌన్ పీఎస్‌లో మంగళవారం విలేకర్ల సమావేశంలో సీఐ నాగశేఖర్ వివరాలు వెల్లడించారు. గుంతకల్లులో రైల్వేగార్డుగా పనిచేసే బాలాజీనాయక్ కుమారుడు సుబ్రమణ్యం నాయక్‌కు, కదిరి మండలం రాచవారిపల్లితాండాకు చెందిన ఎం.చంద్రానాయక్ కుమార్తె అఖిలబాయితో గత ఏడాది నవంబర్ 28న వివాహం జరిగిందన్నారు.
చంద్రానాయక్‌కు స్వగ్రామంలో మూడెకరాల భూమి ఉండగా, అందులో ఒకటిన్నర ఎకరా రాయించుకురావాలంటూ అఖిలబాయిని పెళ్లైన కొన్ని రోజుల నుంచే ఆమె భర్త సుబ్రమణ్యం నాయక్, తల్లిదండ్రులు బాలాజీనాయక్, సుశీలబాయి, అక్కాబావ పుష్ప, హరిలాల్‌నాయక్ ఒత్తిడి చేసేవారన్నారు. అంతేకాకుండా అఖిలబాయి కాలేజీలో చేసిన టిక్‌టాక్ వీడియోను అడ్డుపెట్టుకుని ఎవరితోనో సంబంధాలు పెట్టుకున్నావంటూ భర్త చిత్రహింసలకు గురిచేసేవాడన్నారు.
ఈ నెల ఒకటో తేదీ తెల్లవారుజామున అఖిలబాయితో గొడవ పెట్టుకున్న సుబ్రమణ్యం నాయక్ ఆమె తలపై ఇనుపరాడ్‌తో కొట్టడంతో పాటు ఎడమ చేతి మణికట్టు వద్ద కత్తితో కోసేశాడన్నారు. అయినప్పటికీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో కత్తితో ఆమె గొంతుకోసి పరారైనట్లు సీఐ వివరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మంగళవారం పాత రైల్వేస్టేషన్ బుకింగ్ ఆఫీసు వద్ద సుబ్రమణ్యం నాయక్‌తో పాటు సుశీలబాయి, బాలాజీనాయక్‌లను అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
కేసులో మరో ఇద్దరు నిందితులైన మృతురాలి ఆడపడుచు పుష్ప, ఆమె భర్త హీరాలాల్‌నాయక్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.ముగ్గురినీ స్థానిక జేఎఫ్‌సీఎం కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సీఐ తెలియజేశారు. సమావేశంలో రూరల్ సీఐ లక్ష్మణ్, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment